గ్లామర్ పాత్రలతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో మిల్కీబ్యూటీ తమన్నాకు లేడీ క్వీన్ అనిపించుకోవాలనే పిచ్చపట్టుకుంది. దానికి అనుగుణంగానే ఆల్‌రెడీ 'అభినేత్రి' చిత్రంలో నటించింది. ఈ సినిమా అన్నిభాషల్లో తేడా కొట్టింది. అయినా ఈ భామకు పట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాల పిచ్చి తగ్గినట్లుగా లేదు. కాగా బాలీవుడ్‌లో కంగనారౌనత్ ప్రధాన పాత్రలో కేవలం 12కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన 'క్వీన్' చిత్రం అక్కడ 100కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించడంతో పాటు కంగనాకి ఉత్తమనటిగా జాతీయ అవార్డును, ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డును తెచ్చిపెట్టింది. ఈ చిత్రం దక్షిణాది అన్నిబాషల్లో రీమేక్ హక్కులను తమిళ హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసి, ఇందులో తమన్నాను పెట్టనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
కాగా ఇది ఎట్టకేలకు ఖరారైంది. ఈ చిత్రాన్ని తమిళంలో ప్రముఖ సీనియర్ నటి రేవతి దర్శకత్వం వహిస్తుండగా, మరో సీనియర్ నటి, క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం శ్రీమతి సుహాసిని సంభాషణలు రాస్తోంది. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు దక్షిణాదిలో గుర్తింపు ఉన్న నటుడు, కమల్ స్నేహితుడు, దర్శకుడైన రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు వెర్షన్‌లో కూడా తమన్నానే 'క్వీన్' నటిస్తోంది. తెలుగు, కన్నడ వెర్షన్స్‌ను ఒకేసారి తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ చిత్రంతో తమన్నా సౌత్ ఇండస్ట్రీలో 'క్వీన్' అనిపించుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది.