అసలు పేరు చక్రవర్తి.. ఆయన తన మొదటి చిత్రం 'శివ'లో జెడి అనే పేరుగల రౌడీ విద్యార్దిగా కనిపించడం, ఆ సినిమాలో ఆయనకు మంచి గుర్తింపు రావడంతో జెడి చక్రవర్తిగా మారాడు. ఎప్పుడు గడ్డంతో కనిపిస్తాడు కాబట్టి కొందరు ఆయన్ను గడ్డం చక్రవర్తి అని కూడా పిలుస్తారు. ఇలా పలు నామధేయాలున్న చక్రవర్తి అనేక చిత్రాలలో చిన్న చిన్నపాత్రలు చేస్తున్న సమయంలో ఆయనకు కృష్ణవంశీ దర్శకునిగా పరిచయమవుతున్న 'గులాబి' చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది.ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం.
కాగా ఈ చిత్రంలో హీరో హీరోయిన్లపై బైక్‌లో సాగే పాటను వంశీ చిత్రీకరించిన విధానం బాగా నచ్చడంతో ఏకంగా నాగార్జున ఆయనకు 'నిన్నేపెళ్లాడతా' చిత్రం బాధ్యతలు అప్పగించాడు. ఆ చిత్రం పెద్ద సెన్సేషన్. ఆ తర్వాత కూడా నాగ్ నటించిన 'చంద్రలేఖ' చిత్రానికి కూడా ఆయనే దర్శకుడు. కాగా ఒకప్పుడు హీరోగా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న చక్రి... వర్మగారి వీరశిష్యుడు. ఆయన దర్శకత్వంలో జెడి నటించిన 'సత్య' చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ తనకున్న మేథస్సుతో తనను తాను బహుముఖ ప్రజ్ఞాశాలిగా చాటుకునే ప్రయత్నంలో జెడి నిర్మాతగా, దర్శకునిగా కూడా మారి చివరకు తనకు నటునిగా ఉన్న గుర్తింపును కూడా కోల్పోయాడు.
నాగ్‌కు బ్రేకిచ్చిన 'శివ'లో నటించిన ఆయనకు నాగచైతన్య హీరోగా పరిచయమైన 'జోష్' చిత్రంలో కూడా ఓ పాత్రను ఇచ్చి నాగ్ తన సెంటిమెంట్‌ను చాటుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. కాగా ప్రస్తుతం జెడి కనుమరగయిపోయాడు. వాస్తవానికి వర్మ శిష్యులైన జెడి, కృష్ణవంశీల సినీ జర్నీ ఒకేసారి మొదలైంది. దాంతో వారి మద్య ఎంతో విడదీయరాని బంధం ఉంది. ప్రస్తుతం దర్శకునిగా వంశీ పరిస్థితికి కూడా డేంజర్‌లోనే ఉంది. ఆయన ఎంతో కీలకమైనదిగా భావించి ప్రస్తుతం సందీప్‌కిషన్, రెజీనా జంటగా, మెగాహీరో సాయిధరమ్‌తేజ్, ప్రగ్యాజైస్వాల్‌లు కీలకపాత్రల్లో 'నక్షత్రం' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలోని మరో కీలకపాత్రకు జెడి చక్రవర్తిని తీసుకున్నాడని సమాచారం. మరి జెడి సెంటిమెంట్ వంశీకి ఎంతవరకు కలిసి వస్తుందో వేచిచూడాల్సివుంది.