ప్రస్తుతం నాగార్జున రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి'ల తర్వాత చేస్తున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి10న విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పుడు ఈ చిత్రం టైటిల్‌ను మార్చమని డిమాండ్ చేస్తూ కొన్ని గిరిజన సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామికి పరమభక్తుడైన హథీరాంబాబా జీవిత చరిత్రగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
కాగా శ్రీవేంకటేశ్వస్వామి భక్తుడైన అన్నమయ్యపై జీవితాన్ని తీసి దానికి 'అన్నమయ్య' అనే పేరు పెట్టారని, శ్రీరాముని భక్తుడైన శ్రీరామదాసు జీవిత చరిత్రను తెరకెక్కించి దానికి 'శ్రీరామదాసు' అనే టైటిల్‌ను పెట్టారని, మరి హథీరాంబాబా జీవిత చరిత్రగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మాత్రం 'ఓం నమో వేంకటేశాయ' అనే పేరు ఎందుకు పెడతారని... ? ఈ చిత్రం టైటిల్‌ను కూడా 'హథీరాంబాబాజీ' గా పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చరిత్ర మూలాలలోకి వెళితే శ్రీవేంకటేశ్వరస్వామికి వీరభక్తుడైన హథీరాంబాబా గిరిజనుడని, కాబట్టే ఆయన పేరును చిత్రానికి పెట్టలేదంటూ వారు వాదిస్తున్నారు. మొత్తానికి ఈ టైటిల్ విషయంలో ప్రస్తుతం ప్రారంభమైన వివాదం సద్దుమణుగుతుందా? లేక తీవ్రమవుతుందా? అనేది వేచిచూడాల్సివుంది. మరి ఈ విషయంలో ఈ చిత్ర యూనిట్ స్పందన ఎలా ఉండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.