కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవలారెన్స్. వరుస హర్రర్ చిత్రాలతో సంచలనం సృష్టిస్తోన్న ఈయన కన్నడలో శివరాజ్‌కుమార్ హీరోగా, ప్రముఖ సీనియర్ తమిళ దర్శకుడైన పి.వాసు డైరెక్షన్‌లో రూపొంది, సంచలన విజయం సాధించిన 'శివలింగ'ను అదే దర్శకునితో, తానే హీరోగా తమిళంలోకి రీమేక్ చేస్తున్నాడు. లారెన్స్ సరసన 'గురు' ఫేమ్ రితాకాసింగ్ నటించిన ఈ చిత్రం టీజర్ తాజాగా తమిళంలో విడుదలైంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని అభిషేక్‌పిక్చర్స్ సంస్థ అనువదిస్తోంది. ఇందులో సీనియర్ స్టార్ కమెడియన్ వడివేలు కీలక పాత్రను చేస్తున్నాడు. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన 'చంద్రముఖి', లారెన్స్ తీసిన 'ముని' సీక్వెల్స్ కంటే ఎంతో అద్భుతమైన హర్రర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం లారెన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లుతుందని దర్శకనిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు.
ఇక తాజాగా మెరీనా బీచ్‌లో సాగిన జల్లికట్టు ఉద్యమానికి లారెన్స్ మద్దతు పలకడమే కాదు... ఏకంగా ఆ ఉద్యమంలో పాల్గొంటున్న ఆందోళనకారులకు మంచినీటి, భోజనసదుపాయాల కోసం ఏకంగా కోటిరూపాయలను లారెన్స్ ప్రకటించడమే కాదు.. వెంటనే ఆ డబ్బును సమకూర్చి వసతులు కల్పిండంతో అందరూ ఆయన్ను రియల్‌హీరో అని పొడుగుతున్నారు. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా ఆందోళనకారుల సౌకర్యార్ధం ఆయన తన 'శివలింగ' షూటింగ్‌కు సంబంధించిన టాయిలెట్ సౌకర్యం ఉన్న నాలుగు కేరవానులను మెరీనీబీచ్‌కు తరలించాడు. ఈ ఉద్యమంలో తన ఆరోగ్యం బాగాలేనప్పటికీ మెడకు బ్యాండేజీతో ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయనకు మూడు రోజులుగా విశ్రాంతి లేకపోవడం, అనారోగ్యం కారణంగా సొమ్మసిల్లిపడిపోయినా కూడా పంతం వీడకుండా ఉద్యమంలో పాల్గొన్న ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.