తమిళనాడు మొత్తం జల్లికట్టు క్రీడ కావాలని దాని మీద విధించిన బ్యాన్ ఎత్తివేయాలని సామాన్య ప్రజానీకం దగ్గరనుండి సినిమా తారలు , రాజకీయ నాయకులూ అందరూ ఒక తాటిపైకి వచ్చి పోరాటం జరిపి మరీ కేద్రం నుండి జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తి వేయించారు. అంతమంది వీరోచితంగా ఉద్యమం చేసి మరీ జల్లికట్టు తమిళుల హక్కు అని చాటి చెప్పారు. ఇక చిన్న పెద్ద అందరూ జల్లికట్టును సర్దిస్తుంటే ఒకే ఒక్కడు మాత్రం జల్లికట్టు నిషేధం ముమ్మాటికీ రైట్ అంటున్నాడు ఎవరో ఈపాటికే మీకు అర్ధమైపోయుంటుంది. ఆయనే ట్విట్టర్ రారాజు రామ్ గోపాల్ వర్మ.
నోరులేని జీవాలను హింసించడం అనేది... అమాయక ప్రజలను చంపేసే ఆల్ ఖైదా ఉగ్రవాదులు చేసే పనులు ఒప్పుకున్నట్లే అని ట్వీట్ చేసి సంచలనానికి తెర లేపాడు. శశికళ, జయలలిత, ఎంజీఆర్ లను దేవుళ్ళలా భావించి పూజించే తమిళ ప్రజలు కూడా జల్లికట్టును సమర్థించడం బాగానే ఉంది. విపరీతంగా వ్యక్తి పూజ, జంతు బలి ఆదిమ జాతి తెగల్లోనే జరుగుతుంది. మేమేమో సినిమాల్లో ఏదో చిన్న జంతువులని కష్టపెట్టినా కూడా మాపై రాళ్ళూ రువ్వే ప్రభుత్వం ఎద్దులని అనాగరికంగా హింసించడానికి మాత్రం సై అంటుందని ట్విట్టర్ సాక్షిగా చెలరేగిపోయాడు.
అలాగే సినిమా వాళ్ళు కూడా ఈ జల్లికట్టులోకి దిగి ఎద్దుల వెనుక పరిగెడతారా... అని సవాల్ విసిరాడు. ఏదో సినిమా రాజకీయం చెయ్యడానికే ఇలా జల్లికట్టు ని సినిమా స్టార్స్ సమర్ధించారని... అలా సమర్థిస్తున్న సినిమా వారందరి వెంట కనీసం వంద ఎద్దులను పరిగెత్తించాలి. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏమిటో చెప్పమనాలని వర్మ ట్వీట్స్ చేసాడు.