టాలీవుడ్‌లో జక్కన్నగా పేరున్న రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో ఓ చిత్రం చెక్కడానికి చాలా సమయం తీసుకునే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. కాగా ఆయన తన కెరీర్‌లో 'ఆర్య, 100%లవ్' చిత్రాలు మాత్రమే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. 'నాన్నకు ప్రేమతో' చిత్రం బాగా ఆడినా కూడా దానిని కాస్ట్‌ఫెయిల్యూర్ కింద ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయినా కూడా '1' (నేనొక్కడినే) తర్వాత సుక్కు కెరీర్‌ను మరలా 'నాన్నకు ప్రేమతో' చిత్రమే కాస్త పట్టాలెక్కించింది. కాగా 'ధృవ' నుంచి విభిన్న చిత్రాలు చేయాలని భావిస్తున్న చరణ్ తన తదుపరి చిత్రం సుక్కుతోనే చేస్తున్న సంగతి తెలిసిందే. 'నాన్నకు...' చిత్రం సెట్స్‌పై ఉండగానే సుక్కు ఈ చిత్రాన్ని కన్‌ఫర్మ్ చేశాడు. దీంతో ఆ చిత్రం విడుదలైన ఏడాదికిపైగా సుక్కు గ్యాప్ తీసుకొని చరణ్ కథను చెక్కాడు. మరోపక్క హీరోగా 'ధృవ', నిర్మాతగా 'ఖైదీ నెంబర్ 150'లతోటి చరణ్ కూడా బిజీ అయ్యాడు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందే మూవీకి లాంఛనంగా ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రారంభంకానుంది. ఈ చిత్రాన్ని తన చిత్రాల తరహాలో ఆడియన్స్‌కు ఐక్యూ టెస్ట్ పెట్టనని సుక్కుతో పాటు చరణ్ కూడా హామీ ఇస్తున్నాడు.
ఇక ఈ చిత్రం 1980లలో జరిగే ఓ అందమైన ప్రేమకథా చిత్రం అంటున్నారు. కానీ కొందరు మాత్రం ప్రతి సినిమా ప్రారంభానికి ముందు లెక్కల మాష్టార్ సుక్కు ఇదే మాట చెబుతూ వస్తున్నాడని, కాబట్టి ఆయన మాటలను నమ్మలేమని, ఇది కూడా ఓ టైం ట్రావెలింగ్ కథతో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని 'శ్రీమంతుడు, జనతాగ్యారేజ్' వంటి మొదటి రెండు చిత్రాలతోనే బ్లాక్‌బస్టర్స్ నమోదు చేసి, టేస్ట్ ఉన్న నిర్మాణ సంస్థగా పేరుతెచ్చుకున్న మైత్రీ మూమీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ కొట్టాలనే కసితో నిర్మిస్తోందని సమాచారం. మరోపక్క ఈ చిత్రానికి కూడా సుక్కు ఆస్ధాన సంగీత దర్శకుడు, మైత్రి మూవీ సంస్థకు కూడా ఆస్ధాన మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్న దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికే ఖరారు కాగా, మరో హీరోయిన్‌గా రాఖిఖన్నా నటించనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రమైనా బన్నీకి 'ఆర్య' తరహాలో పెద్ద హిట్ అయి చరణ్ కెరీర్‌నే కాదు.. సుక్కు కెరీర్‌ను కూడా గాడిలో పెడుతుందో లేదో వేచిచూడాల్సివుంది.