సాధారణంగా ఎప్పటినుంచో సంక్రాంతి సీజన్ అయిన జనవరి సినిమాలకు మంచి సీజన్ అని, ఆ తర్వాత వచ్చే ఫిబ్రవరి నెల సినిమాలకు అన్‌సీజన్‌గా భావించడం జరుగుతోంది. కానీ సమ్మర్‌లో సినిమాల పోటీ ఎక్కువగా ఉంటుంది. మార్చిలో విద్యార్దులకు, పిల్లలకు పరీక్షలుంటాయి. ఆ లెక్కన చూసుకుంటే ఫిబ్రవరి మంచి సీజనే అనేది ఈమధ్య కొన్ని చిత్రాలతో ప్రూవ్ అయింది. 'మిర్చి, టెంపర్, కృష్ణగాడి వీరప్రేమగాధ' వంటి చిత్రాలు ఈ విషయాన్ని నిరూపించాయి. దాంతో రాబోయే ఫిబ్రవరిలో కూడా దాదాపు అరడజనుకు పైగా చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. నాని హీరోగా దిల్‌రాజు నిర్మాతగా 'సినిమా చూపిస్త మావా' దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న 'నేను.. లోకల్' చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్‌తో పాటు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక అదే రోజున మంచు విష్ణు హీరోగా 'గీతాంజలి' ఫేమ్ రాజ్‌కిరణ్ దర్శకత్వంలో విష్ణుకి కలిసి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'లక్కున్నోడు' చిత్రం కూడా విడుదల కానుంది. ఇందులో విష్ణు తనకి అచ్చివచ్చిన హీరోయిన్ హన్సికతో జతకడుతున్నాడు.
ఫిబ్రవరి 10న నాగార్జున-రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో 'అన్నమయ్య, శ్రీరామదాసు'ల మాదిరిగా శ్రీ వేంకటేశ్వర స్వామి వీరభక్తుడైన హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' భారీ అంచనాలతో వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌తో పాటు స్వరబ్రహ్మ కీరవాణి అందించిన ఈ చిత్రం మ్యూజికల్ ఆల్బమ్ శ్రోతలకు వీనులవిందుగా మారింది. ఇక అదే రోజు మరో మంచు హీరో మనోజ్.. సత్య దర్శకత్వంలో నటిస్తున్న 'గుంటూరోడు' చిత్రం విడుదల కానుంది. ఫిబ్రవరి 17న రానా హీరోగా ట్రైలర్‌తోనే సంచలనం సృష్టించిన 'ఘాజీ' చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్‌కానుంది. అదే రోజు విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న యంగ్‌హీరో రాజ్‌తరుణ్ నటిస్తున్న 'కిట్టుఉన్నాడు జాగ్రత్త' కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఫిబ్రవరి 24న 'తిక్క' లాంటి ఫ్లాప్ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'విన్నర్' చిత్రం కూడా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ చిత్రానికి రకుల్‌ప్రీత్‌సింగ్, అనసూయలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీటితో పాటు 'లక్ష్మీబాంబు, కేశవ' వంటి పలు చిన్నచిత్రాలు కూడా ఇదే నెలలో విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి.