అప్పొజిషన్ ను ఎదుర్కోవాలంటే ఎప్పటికప్పుడు ప్రణాళిక రచించుకోవాలి. అప్పుడే ఎగస్పార్టీకి చెక్ పెట్టగలరు. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే 'శాతకర్ణి' యూనిట్ చేస్తోంది. మొదటి రోజు లెక్కలు చెప్పేసి ప్రత్యర్థికి సవాల్ విసిరారు అల్లు అరవింద్. ఒక రోజు తేడాతో విడుదలైన 'శాతకర్ణి' సినిమా కూడా ఘనవిజయం నమోదు చేసింది. అయితే 'ఖైదీ'కి చెప్పినట్టుగా కలక్షన్లు బహిర్గతం చేయలేని ఇబ్బందులున్నాయి. 'ఖైదీ..' కోసం ఎక్కువ థియేటర్లు కేటాయిస్తే, 'శాతకర్ణి'కి థియేటర్ల సంఖ్య తక్కువే. అందువల్ల కలెక్షన్లలో తేడా ఉంటాయి. ఈ కారణంగా లెక్కలు చెప్పకుండా ఇప్పుడు కొత్త ప్రచారానికి తెరదీశారు. ''అదేమంటే తెలుగు చలనచిత్ర చరిత్రలో... మొదటి వారంలోనే పెట్టుబడి రాబట్టి, లాభాల బాట పట్టిన మొట్టమొదటి చిత్రం'' అంటూ ప్రత్యర్థికి సవాల్ విసిరారు. 'మొట్టమొదటి' చిత్రం అని చెప్పడంలోనే మతలబు ఉంది. అది కూడా తెలుగు సినిమా చరిత్రలో అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. కేవలం అంకెలు చెప్పడం కాదు. అసలైన హిట్ మాదే అని సంకేతం పంపించారు. ఇది లౌక్యంతో వేసిన ఎత్తుగడ.' ఫాస్టెస్ట్ 100 ప్లస్ క్రోర్ గ్రాసర్' అని 'ఖైదీ' సినిమా ప్రచారం చేస్తున్నారు. కలెక్షన్లు వచ్చాయన్నారు కానీ లాభాలు తెచ్చాయని చెప్పడం లేదు. సరిగ్గా ఈ లోపాన్నే 'శాతకర్ణి' ఉపయోగించుకుంది.