రజనీకాంత్ 'కబాలి' వీక్షించడం కోసం కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు సెలవు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150 ' కోసం కూడా సెలవు ఇచ్చారని అల్లు అరవింద్ చెబితే నిజమా... అనుకున్నారు. కేవలం స్టార్స్ సినిమాలకే ఈ క్రెడిట్ దక్కుతుందని, ఇతర హీరోలకు ఛాన్స్ లేదని అనుకోవద్దు. ఎందుకంటే రజనీకాంత్, చిరంజీవి వీరిద్దరి సినిమాలకు లభించని గౌరవం ఆర్. నారాయణమూర్తి నటించిన 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమాకు దక్కింది. సినిమా రిలీజ్ అయ్యాక సినిమా కోసం సెలవు ప్రకటించారు. విషయానికి వస్తే హెడ్ కానిస్టేబుల్ నీతి నిజాయితీకి దర్పణం పట్టే సినిమా ఇది. వృత్తిలో అవినీతికి పాల్పడకుండా ఒక పోలీస్ నిజాయితీగా ఎలా వ్యవహరించాడనేది పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి సినిమాలో చూపించారు. ఈ చిత్రం గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా యస్. పి. శ్రీనివాస్ స్పందించారు. తమ జిల్లాలోని హెడ్ కానిస్టేబుల్స్ అందరూ ఈ సినిమా చూడాలని తెలుపుతూ... ఒక రోజు సెలవు ప్రకటించారు. పోలీసుల్లో నిజాయితీకి 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమా ప్రేరణ ఇస్తుందని యస్. పి. అభిప్రాయపడ్డారట. ఒక సినిమా రిలీజ్ అయ్యాక డిపార్ట్ మెంట్ లో సెలవు ఇవ్వడం అనేది నిజంగా ఆసక్తి కలిగించే విషయం.