సాధారణంగా ఓ చిత్రాన్ని స్టార్ ఇమేజ్ ఉండే హీరోలు చేస్తే వచ్చే కిక్కు.. మైలేజే వేరు. అందునా అందులో ఓ సమస్యని గురించి చర్చించి, మెసేజ్ ఇచ్చినప్పుడు అది సామాన్యులకు కూడా కలకాలం గుర్తిండిపోతుంది. అదే సమస్యపై మరో స్టార్ చిత్రం చేస్తే.. దానికి కాపీ అనే ముద్రపడటం గ్యారంటీ. గతంలో 'భారతీయుడు', 'ఠాగూర్' చిత్రాలలో అవినీతిని గురించి చర్చించారు. ఆయా చిత్రాలను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. అదే సమయంలో బాలకృష్ణ కూడా అవినీతికి వ్యతిరేకంగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో 'ఒక్క మగాడు' చిత్రం చేశాడు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ విషయంలో బాలయ్యకు వచ్చిన జ్ఞానోదమయే ఇప్పుడు 'రైతు' చిత్రం ఆగిపోవడానికి కారణం అంటున్నారు. వాస్తవానికి కృష్ణవంశీ బాలయ్య వందో చిత్రంగా 'రైతు' చేయాలని భావించాడు. అందులో అమితాబ్‌ను కీలకపాత్రకు ఒప్పిస్తే ఆ చిత్రం చేస్తానన్నాడు బాలయ్య. అదే అమితాబ్ అప్పుడే ఆ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పివుంటే బాలయ్య వందో చిత్రం 'గౌతమీపుత్ర...' స్థానంలో 'రైతు' తెరకెక్కి ఉండేది. అదే జరిగివుంటే ఈ ఏడాది సంక్రాంతికి చిరు, బాలయ్యలు ఇద్దరు రైతు సమస్యలపైనే చిత్రాలు చేసి పోటీపడేవారు. కానీ బాలయ్య 'గౌతమీ..' చేయడం, చిరు 'ఖైదీ..' చేయడం జరిగింది. 'కత్తి'కి రీమేకే అయినప్పటికీ 'ఖైదీ...' చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు బాలయ్య తన 101వ చిత్రంగా అమితాబ్ ఒప్పుకున్నా కూడా 'రైతు' చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు తాను రైతు సమస్యలపై చిత్రం చేస్తే అది చిరు 'ఖైదీ'కి కాపీ కొట్టినట్లు అవుతుందనే ఆలోచనలో బాలయ్య ఉండటంతో ఇక ఈ చిత్రం ఆగిపోయినట్లే అని తెలుస్తోంది. మరోపక్క చిరు తన 151వ చిత్రం విషయంలో కూడా ఇదే తర్జనభర్జన పడుతున్నాడు. ఆయన డ్రీమ్‌ప్రాజెక్ట్ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని 151వ చిత్రంగా చేయాలని భావించాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. కానీ ఇప్పుడు మరోసారి తెలుగువాడి పౌరుషాన్ని చూపిస్తూ, చారిత్రక కథ అయిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చేస్తే అది బాలయ్య 'గౌతమీపుత్ర...'తో పోల్చిచూడటం ఖాయం.. అందుకే ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ మనోభిప్రాయాలను మార్చుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.