'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్' వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత ఎన్టీఆర్ ఎంతో గ్యాప్ తీసుకొని ఎట్టకేలకు బాబీ దర్శకత్వంలో తన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌లో తన 27వ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై పలు వార్తలు ప్రచారంలోకి రావడంతో కళ్యాణ్‌రామ్ స్వయంగా స్పందించి... ఈ చిత్రం గురించి మిగిలిన ఏ విషయాలు ఫైనల్ కాలేదని, కాబట్టి రూమర్లను నమ్మవద్దని కోరడం జరిగింది. కాగా ఈనెల మొదటి వారంలో కళ్యాణ్‌రామ్ తన బేనర్‌లో 'జై.. లవ..కుశ' అనే టైటిల్ రిజిష్టర్ చేయించడంతో మరోసారి ఈ చిత్రం వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి కళ్యాణ్‌రామ్ మిగిలిన ప్రాజెక్ట్‌లు ఏమీ చేయడం లేదని, కేవలం యంగ్‌టైగర్‌తోనే సినిమా చేస్తుండటం వల్ల ఈ టైటిల్ ఎన్టీఆర్ చిత్రం కోసమే అనే వార్తలు ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి11న ప్రారంభించి, అదే రోజు నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఎన్టీఆర్ 'జై', 'లవ', 'కుశ' అనే మూడు పాత్రలను చేస్తున్నట్లు మరోసారి ప్రచారం మొదలైంది.
అయితే ఈచిత్రం టైటిల్ ఎన్టీఆర్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్‌గా లేదని కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే ఈమధ్యకాలంలో ఎన్టీఆర్ కథల ఎంపికలోనే గాకుండా, టైటిల్స్ విషయంలో కూడా పెద్దగా పవర్‌ఫుల్‌గా లేకపోయినా కథకు అనుగుణమైన టైటిల్స్‌ను ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. పూరీ చిత్రానికి 'టెంపర్', సుక్కుతో 'నాన్నకు ప్రేమతో', కొరటాలతో 'జనతాగ్యారేజ్' వంటి టైటిల్స్‌ను ఉదాహరణగా చూపిస్తూ... 'జై లవ కుశ' కూడా ఆయన చిత్రానిదే అని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి దీని విషయంలో కళ్యాణ్‌రామ్ అధికారికంగా ప్రకటించే వరకు ఎటూ తేల్చలేమని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా ఈచిత్రంతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టడం ఖాయమని ఆయన అభిమానులు ఘంటాపథంగా చెబుతున్నారు.