సినిమా సెలబ్రిటీలకు అవార్డులు గౌరవం. వృత్తిలో నైపుణ్యతకు నిదర్శనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమంగా ఫిల్మ్ ఫేర్ పత్రిక ఇచ్చే అవార్డులను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. సదరు పత్రిక అవార్డుల ప్రదాన్ని హంగామాగా నిర్వహిస్తుంది. అయితే ఇటీవల సీనియర్ బాలీవుడ్ నటుడు రిషికపూర్ ఫిల్మ్ ఫేర్ పత్రిక ఇచ్చే అవార్డుల రహస్యాన్ని బయటపెట్టాడు. అవార్డులు ఇవ్వడానికి ఆ పత్రిక నగదు తీసుకుంటుందని, తన తొలి సినిమా బాబి (1973)లో నటించిన తనకి ఉత్తమ నటుడి పురస్కారం ఇవ్వడానికి ఆ రోజుల్లోనే 30 వేలు తీసుకుందని చెప్పేశారు. దాంతో ఫిల్ ఫేర్ పురస్కార గ్రహితలంతా తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. ఫిల్మ్ ఫేర్ పత్రిక అవార్డులను అమ్ముతుందనే విషయం ఇంతవరకు గుసగుసలుగా వినిపించినా రిషికపూర్ దాన్ని బహిర్గతం చేసేశారు. దీంతో ఆ పత్రిక అవార్డులను అమ్ముతుందని, కొందరు వాటిని కొనుక్కుంటారనే విషయం వెల్లడయింది. ప్రతి ఏడాది ఉత్తరాదికి, దక్షిణాదికి వేరువేరుగా ఫిల్మ్ ఫేర్ పత్రిక అవార్డులను అందజేస్తుంది. ఎవరినీ మిస్ చేయకుండా పంచుతుంటారు. అందుకే చాలా మంది సెలబ్రిటీల కు ఈ అవార్డులు దక్కుతుంటాయి. ఇకపోతే రిషికపూర్ చేసిన ఆరోపణపై ఆ పత్రిక ఇంకా స్పందించలేదు.