దాదాపు 350 సినిమాలకు రచన చేసి, ఎన్నో విజయాలను తమ ఖాతాలో వేసుకున్న పరుచూరి బ్రదర్స్ యంగ్ జనరేషన్ తో పోటీపడలేక కాస్త వెనక్కి పోయారు. ఈ తరం చమత్కారాలు, సోషల్ మీడియా జోకులు, కామెంట్స్, యువతరం ఆలోచన ధోరణిపై పట్టు దొరక్కపోవడంతో ఖాళీగానే ఉన్నారు. వారి అనుభవం కేవలం కథా చర్చలకే పరితమైంది. కానీ అనూహ్యంగా వారికి చిరంజీవితో పనిచేసే అవకాశం 'ఖైదీ నంబర్ 150' చిత్రానికి దక్కింది. చిరంజీవి ఎదుగుదలలో బ్రదర్స్ పాత్ర ఎంతగానో ఉంది. మెగాస్టార్ కెరీర్ మలుపు తిప్పిన ' ఖైదీ' సినిమాకు వారే రచన చేశారు. అందుకే తమ తరానికి చెందిన చిరంజీవికి మళ్లీ వర్క్ చేసే ఛాన్స్ కొత్త 'ఖైదీ'తో దక్కించుకున్నారు. ఇది రీమేక్ కాబట్టి, కేవలం తమిళ సంభాషణలకు తెలుగు రూపం ఇస్తే సరిపోతుందని అనుకున్నారు .కానీ ఊహించని విధంగా 'ఖైదీ..' సినిమా రచన విభాగంలో సత్యానంద్, బుర్రా సాయిమాధవ్ కూడా చేరారు. వారు కొన్ని సీన్స్ రాశారు. దాంతో పరుచూరి ప్రాధాన్యత తగ్గింది. చిరంజీవికి కావాల్సింది సక్సెస్ కాబట్టి ఇలాంటి విషయాలను వారు పట్టించుకోరు.
ఇప్పుడు 'ఖైదీ...' విడుదలై విజయం పొందింది. మరి సినిమాకు రచన చేసిన బ్రదర్స్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రమే కనిపించారు. ఆ తర్వాత వారిని పక్కన పెట్టేశారనే మాట వినిపిస్తోంది. 'ఖైదీ...' సక్సెస్ క్రెడిట్ మొత్తం చిరంజీవి ఎకౌంట్ లో వేసే ప్రయత్నంలో అందరితో పాటుగానే బ్రదర్స్ ను పక్కన నెట్టేశారు. కాలంలో వచ్చిన మార్పును అర్థం చేసుకున్న బ్రదర్స్ సైలెంట్ గా ఉన్నారు. అయితే త్వరలో జరిగే థాంక్స్ మీట్ లో మాత్రం మళ్ళీ వారికి మైక్ ముందు మాట్లాడే అవకాశం రానుంది.