సంక్రాంతి కానుకగా చిరు 'ఖైదీ', బాలయ్య 'గౌతమీపుత్ర...', దిల్‌రాజు 'శతమానం...తో పాటు పీపుల్స్‌స్టార్ 'హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య' రిలీజ్ కాగా...చిరు, బాలయ్య, దిల్‌రాజుల చిత్రాలు అనూహ్య కల్షెన్లు సాధిస్తున్నాయి. మా చిత్రానికి అంత వచ్చిందంటే... మా చిత్రం ఇంత కలెక్ట్ చేసిందంటూ ప్రకటనలైతే వస్తున్నాయి...కానీ ఇప్పటివరకు నిజమైన విజేత ఎవరో తెలియడం లేదు. మొత్తానికి సంక్రాంతి సీజన్ ముగిసింది. సెలవులు కూడా ముగిశాయి. పిల్లలు, తల్లిదండ్రులు మరలా బిజీ బిజీ అయిపోయారు. దీంతో నిజమైన సంక్రాంతి విజేత ఎవరు? ఏ చిత్రం లాంగ్‌రన్‌లో మంచి లాభాలు సాధిస్తుంది...? అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాలలోనూ దాదాపు అన్ని థియేటర్లలో ఇవే చిత్రాలు ఆడుతున్నాయి. ఈ మూడు చిత్రాల మేకర్స్ మద్య, మొదటి వారం తర్వాత ఎవరి చిత్రానికి మంచి టాక్ వస్తుంది? ఏ చిత్రానికి మంచి కల్షెన్లు వస్తున్నాయి? అనేదాని ఆధారంగా ఏ చిత్రానికి థియేటర్లు తగ్గించాలి? ఏ చిత్రానికి థియేటర్లు పెంచాలి? అనే నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి డిసెంబర్ చివరలో విడుదలైన 'దంగల్', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలను చూడాలని ఆశించిన పలువురు సినీ ప్రియులు ఆ చిత్రాలకు బాగానే కల్షెన్లు ఉండటంతో వాటిని తీసేయరులే.. అనే నమ్మకంతో కాస్త ఆగినవారు ఉన్నారు. కానీ ఈ మూడు బడా చిత్రాల కారణంగా చాలా సెంటర్లలో ఆయా చిత్రాలను తీసివేయడం దారుణమనే చెప్పాలి.
ఇక ఈ బడా చిత్రాల విషయంలో కలెక్షన్లు ఎలా ఉన్నా సరే... ఇవి చిరు, బాలయ్య, దిల్‌రాజులకు ప్రతిష్టాత్మక చిత్రాలు కావడంతో కలెక్షన్లతో పనిలేకుండా తమ తమ చిత్రాలను కనీసం అర్థశతదినోత్సవం వరకైనా థియేటర్లలో పట్టుబట్టి ప్రదర్శిస్తారనేది వాస్తవం. మరి అదే జరిగితే ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడి జనవరి26న గర్జించాలని వస్తోన్న సూర్య 'ఎస్3' చిత్రానికి పెద్దగా థియేటర్లు దొరక్కపోవచ్చు. అందునా ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దగా పేరులేని మర్కాపురం శివకుమార్ విడుదల చేస్తుండటం కూడా పెద్ద మైనస్‌గా చెప్పవచ్చు. ఇక 'ఎస్3' చిత్రాన్ని తమిళంలో ప్రభుత్వ రాయితీల కోసం 'సి3'గా మార్చారు. కానీ తెలుగులో మాత్రం ఈ చిత్రం 'ఎస్3' (యముడు3)గా విడుదలకానుంది. ఇది పక్కా మాస్ చిత్రం కావడంతో బి,సి సెంటర్లలోని ప్రేక్షకులను బాగా అలరించే అవకాశం ఉంది. మరి ఈ చిత్రానికి ఆయా సెంటర్లలో ఎంతమాత్రం థియేటర్లు దొరుకుతాయో? వేచిచూడాల్సివుంది.