ఓవైపు పవర్‌స్టార్‌గా...మరోవైపు జనసేనాధిపతిగా పవన్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో పవన్ స్పందించేదాకా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాలేదు. ఒక్కసారిగా పవన్ ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించడంతో ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నుండి ఏకంగా ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దానిపై దృష్టి కేంద్రీకరించారు. పవన్ ఇప్పటికే ఆ ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఎక్కువ కావడానికి గల మూలాలను కనుక్కోవాలని ఓ కమిటీని నియమించి 15రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం పవన్ మూలంగా మీడియాలో కూడా హైలైట్ కావడంతో ఆ ప్రాంతంలో కిడ్నీవ్యాధితో బాధపడుతున్న వారికి చంద్రబాబు పించన్లను ప్రకటించారు. మరోపక్క ఆయన కూడా కొంత మంది మంత్రులు, అధికారులతో కమిటీ వేసి, సమస్య మూలాలను కనుక్కోవాలని ఆదేశించారు. ఈ కమిటీ కూడా ఆ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి, సమస్య మూలాలను కనుక్కోనుంది. అంతకు ముందుగానే పవన్ నియమించిన బృందం నివేదిక వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో ప్రభుత్వ కమిటీ కూడా ఆలోపే నివేదిక ఇవ్వాలని ఆరాటపడుతోంది. మొత్తానికి తన కమిటీ నివేదిక అందించిన వెంటనే పవన్.. సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీకానున్నారు.
మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చేనేత కార్మికుల దుస్థితి, వారి ఆత్మహత్యలకు చలించిన పవన్ ఇక నుంచి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో తాను చేనేత వస్త్రాలకు ఉచితంగా బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తానని ప్రకటించాడు. అప్పుడెప్పుడో తన అన్నయ్య చిరు థమ్సప్‌కు బ్రాండ్‌అంబాసిడర్‌గా పనిచేసిన సమయంలో పవన్ పెప్సీ సంస్థకు అంబాసిడర్‌గా పనిచేశారు. కానీ ఆ తర్వాత నుంచి ఆయన తనకున్న క్రేజ్‌కు ఎన్నో కమర్షియల్ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని నిరాకరిస్తూ వస్తున్నారు. మొత్తానికి పవన్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉచితంగా పనిచేయడానికి ఒప్పుకోవడంతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్మికుల కుటుంబాలకు కూడా సాయం చేస్తానని ప్రకటించడం హర్షణీయం. సో.. ఇలా పలు రాజకీయ అంశాల్లో కూడా పవన్ బిజీగా ఉండటంతో ప్రస్తుతం ఆయన డాలీ దర్శకత్వంలో చేస్తున్న 'కాటమరాయుడు' చిత్రం కాస్త ఆలస్యం కానుందని సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్‌ను ఈ నెలాఖరుకు పూర్తి చేసి, ఫిబ్రవరి నుంచి ఆయన త్రివిక్రమ్ సినిమాను సెట్స్‌పైకి తీసుకుపోవాలని భావించారు. కానీ 'కాటమరాయుడు' ఆలస్యం కానుండటంతో త్రివిక్రమ్ చిత్రాన్ని మార్చి నుండి సెట్స్‌పైకి తీసుకొని పోవాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.