చిరు 'ఖైదీ నెంబర్ 150' చిత్రం, బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు ఒకేసారి బరిలోకి దిగడంతో వారి అభిమానులు తమ కామెంట్స్, ట్వీట్స్‌తో సినిమాలకు మంచి ప్రమోషన్ కూడా కల్పిస్తున్నారు. కాగా కొందరు అభిమానంతో చేస్తున్నారో? లేక వెటకారం చేస్తున్నారో తెలియని విధంగా కొన్ని ట్వీట్స్, వాట్సప్ మేసేజ్‌లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ 'ఇప్పుడే చిరంజీవిగారితో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన చాలా గొప్ప మనిషి. ఎంతో మంచి సినిమా చేశాడు. 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని నేను భార్య కూతురితో సహా చూసి ఎంతో ఎంజాయ్ చేశాను....' అని ఆయన పెట్టినట్లుగా ఓ నెటిజన్ ట్వీట్ పెట్టాడు.
ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక 'ఖైదీ నెంబర్ 150' చిత్రం రిలీజ్ సందర్భంగా అమెరికాలో ట్రాఫిక్‌ను అదుపుచేయడం కోసం వాహనాలను దారి మరలిస్తున్నట్లుగా ఓ ఫ్లై ఓవర్ స్క్రీన్‌పై స్క్రోలింగ్ వస్తున్నట్లుగా ఉన్న ఓ వాట్సప్ మెసేజ్ కూడా తెగ హడావుడి చేస్తోంది. ఎవరి అభిమానమైనా, దురభిమానంగా మారకుండా ఉండేంత వరకు అయితే ఫర్లేదు. అది దాటి వెళ్లితే ఇతరుల మనోభావాలను దెబ్బతీసినట్లే అవుతుంది. తమ హీరో చిత్రం బాగుందని చెప్పుకోవడంలో తప్పులేదు కానీ... ఇలా వ్యంగ్యంగా మెసేజ్‌లు, ట్వీట్స్ పెట్టడం చూస్తుంటే చిరు ఫ్యాన్స్ అభిమానం హద్దులు మీరి ఇలా చేశారా? లేక చిరు వ్యతిరేక అభిమానులు ఈ వెటకారపు పబ్లిసిటీ చేస్తున్నారా? అన్న సందేహం రాకమానదు.
ఇక ఇటీవల బాలయ్య ఓ అభిమానిని తోసివేసి, సెల్‌ఫోన్ విసిరికొట్టడం.. వీడియో చూసి చాలా మంది బాలయ్య ప్రవర్తనను ఖండించడం జరిగింది. దీనికి ఆ బాధితుడైన అభిమాని హర్ష వివరణ ఇచ్చాడు. ఓ అభిమానిగా తమ హీరోపై దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు దానిని ఖండించాల్సిన బాధ్యత తనపై ఉందని, అసలు జరిగింది ఒకటైతే బయట మరోలా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాలయ్య వస్తున్నారని తెలిసి భ్రమరాంబ థియేటర్‌కు వెళ్లాను. ఆయనతో ఫొటో దిగాలనే ఉత్సాహంతో ముందుకెళ్లాను. ఆ రద్దీలో నేను ఆయన కాలిని చెప్పులతో తొక్కాను. దాంతో ఆయన నాచేతిని, నన్ను వెనక్కినెట్టారు. అంతేగానీ బాలయ్య నన్ను కొట్టలేదు... అంటూ వివరణ ఇచ్చి, ఇది తమ హీరోను అప్రదిష్టపాలు చేయడానికి నెగటివ్‌గా ప్రచారం చేస్తున్నారని వివరణ ఇవ్వడం కూడా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.