రాజకీయం ఎక్కడైనా ఒకటే, పూర్వం రాజ్యాల కోసం తండ్రిని, సోదరులను హతమార్చిన చరిత్ర ఉంది. బలవంతంగా రాజ్యాన్ని లాగేసుకున్న వారసులు ఉన్నారు. కలియుగంలో కూడా వారికి వారసులు కనిపిస్తున్నారు. గతంలో ఏ.పి.లో జరిగిందే నేడు యు.పి.లో జరిగింది. ఇరవై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ నుండి బలవంతంగా అధికారం లాగేసుకున్న చంద్రబాబు గురించి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములా యు.పి.లో జరిగింది. తెలుగుదేశం పార్టీని, సైకిల్ గుర్తును చట్టపరంగా కూడా బాబు సొంతం చేసుకున్న విధంగానే యు.పి. ముఖ్యమంత్రి అఖిలేష్ కూడా ప్రవర్తించారు. తండ్రి స్థాపించిన సమాజ్ వాదీ పార్టీని, సైకిల్ గుర్తును చట్ట ప్రకారం సొంతం చేసుకున్నాడు.
ఈ రాజకీయ పరిణామాలు ప్రజలను ఆశ్చర్యపరిచాయి. అధికారం అనే మాయలో బంధుత్వం, రక్తసంబంధం ఉండవని అప్పుడు బాబు, ఇప్పుడు అఖిలేష్ నిరూపించారు. నేతలే ఈ విధంగా ప్రవర్తిస్తే సామాన్యులు ఆస్థుల కోసం తండ్రిని ఎదిరించడం, నమ్మినవారిని మోసం చేసి లాగేసుకోవడం ఆశ్చర్యం కలిగించదు. ఆదర్శంగా ఉండాల్సిన వారే ఆచరించకుంటే అది ప్రజలకు తప్పుడు సంకేతం అందిస్తుంది.