ఏ హీరో అభిమానులు ఆయా హీరోలను పొగడ్తలతో ముంచేయడం, మహా అయితే పక్క హీరోల సినిమాలపై సెటైర్లు వేయడం మామూలే. కానీ కొన్ని సార్లు ఆ విబేధాల వల్ల ఉద్రిక్తతలు తలెత్తేవిధంగా పరిస్థితులు దిగజారి, లా అండ్ ఆర్డర్ సమస్యగా మారడం మాత్రం బాధాకరం. తాజాగా కడపజిల్లాలోని పులివెందులలో బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ధియేటర్‌లో సెకండ్‌షో ముగిసిన తర్వాత అర్ధరాత్రి 1గంట సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ లోపలికి వచ్చి, నందమూరి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి, వాటిని తగులబెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొని, ఏకంగా ఏఎస్పీ స్థాయిలో కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. సిసి కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇలా ఈ సంఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఇక కృష్ణాజిల్లా కైకలూరు మండలంలోని ఓ గ్రామంలో చిరంజీవి ఫ్లెక్సీలనే కాకుండా వంగవీటి రంగా ఫ్లెక్సీలను కూడా చింపివేయడంతో దీనికి కులం రంగు పులుముకుంది. ఇలా కేవలం సినిమాలను సినిమాలుగా భావించి చూడటం మానేసి రాజకీయాలు, కులాల రంగు పులుముకోవడం బాధాకరమనే చెప్పాలి. దీనికి రాజకీయనాయకులే గాక కులం ముసుగులో రాజకీయాలు చేసే పెద్దల హస్తం కూడా ఉంటుందనేది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు హీరోలు తమ అభిమానులను హద్దు మీరవద్దంటూ బహిరంగంగా విజ్ఞప్తి చేస్తే హుందా ఉండి, ఈ ఇద్దరు హీరోల అభిమానులు శాంతిస్తారు. అలా చేయకుండా మౌనం పాటిస్తుంటే మాత్రం ఆయా హీరోలది కూడా తప్పు అవుతుంది. తమ అభిమానులను హద్దుల్లో ఉంచాల్సిన బాధ్యత తప్పకుండా ఆయా హీరోలే తీసుకోవాలి. లేకపోతే అభిమానులు వెర్రిగా చేసే ఇలాంటి దుశ్చర్యల వల్ల సామాన్యులు కూడా ఇబ్బంది పడాల్సివస్తుంది. ఆ తప్పుకు చివరకు హీరోలే బాధ్యులవుతారనేది వాస్తవం.