తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై రాజకీయ కుట్రకు తెరలేచింది. ఆయన రాజకీయ ఆలోచనను మొగ్గలోనే చెక్‌పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిబాణాన్ని నటుడు, రాజకీయ నేత శరత్‌కుమార్ సంధించాడు. ఒక తమిళ వ్యక్తి మాత్రమే తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. దీనర్థం ఏమిటో తెలుస్తూనే ఉంది. కర్నాటక రాష్ట్రంలో పుట్టి పెరిగిన రజనీ తమిళ సినిమాల్లో ప్రవేశించి సూపర్‌స్టార్‌గా ఎదిగారు. తమిళ ప్రజల ఆరాధ్యదైవంగా కొనియాడబడుతున్నారు. నలభైయేళ్ళ సుదీర్ఘ నటజీవితం ఆయనది. అలాంటి ఆయనపై స్థానికేతరుడు అనే ముద్రవేసే ప్రయత్నం జరుగుతోంది.
జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో శరత్‌కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళ పీఠం కాపాడుకోవడానికి అన్నాడిఎంకే కొత్త నేత శశికళ వ్యూహాత్మకంగాఈ ఆరోపణలు చేయించిందని, తమిళ ప్రజల్లో అనుమానం రాజేసిందని భావిస్తున్నారు. అలాగే రజనీకాంత్ పార్టీ పెట్టకూడదని కూడా శరత్ కుమార్ సూచించడం గమనార్హం.
ఇదిలా ఉంటే రజనీపై చేసిన విమర్శలు వివాదస్పదం కావడంతో శరత్‌కుమార్ మాటమార్చారు. తన మాటలను మీడియా వక్రీకరించందని అన్నారు. పార్టీ పెట్టకూడదని తాను అనలేదని, పార్టీ పెడితే మాత్రం ప్రత్యర్థిగా భావిస్తానని సర్దుకున్నారు.