పూర్తిస్థాయి హీరోగా చిరుకు దాదాపు దశాబ్దకాలం గ్యాప్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఆమధ్యలో ఆయన కేవలం తన తనయుడు రామ్‌చరణ్ నటించిన 'మగధీర, బ్రూస్‌లీ' చిత్రాలలో మాత్రమే తళుక్కుమన్నాడు. ఇక ప్రస్తుతం 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ తన 150వ భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెంబర్150'తో రీఎంట్రీ ఇచ్చి మెగాభిమానుల దాహార్తిని తీరుస్తున్నాడు. ఆయన ఈ వయసులో, ఇంత గ్యాప్ తర్వాత కూడా పూర్వపు యంగ్‌లుక్, మేకోవర్, ఎనీర్జీలతో పాటల్లో, ఫైట్స్‌లో, కామెడీ టైమింగ్‌లో... ఇలా అన్ని విషయాలలోనూ తన సత్తా చాటి తాను ఇప్పటికీ రారాజునే అని నిరూపిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన ఇచ్చిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.
చిరు తన కెరీర్ మొదట్లో ఎన్ని హిట్ చిత్రాలలో చేసినా కూడా ఆయన తలరాతను మార్చి, ఆయన్ను స్టార్‌ని చేసిన చిత్రం మాత్రం 'ఖైదీ'నే అనేది వాస్తవం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మాధవి, సుమలతలు హీరోయిన్లుగా ఆయన నటించిన ఈ చిత్రం పెద్ద సంచలనం సృష్టించింది. దాంతో ఆయన క్రేజ్ ఈ ఒక్క చిత్రంతో పూర్తిగా మారిపోయింది. ఇలా ఆయన నటించిన 'ఖైదీ' చిత్రమే ఆయన కెరీర్‌లో ఓ మైలురాయిగా ఇప్పటివరకు అందరూ భావిస్తూ వచ్చారు. కాగా తాజా ఇంటర్వ్యూలో మీరు నటించిన గత చిత్రాలలో ఏ చిత్రాన్ని మరలా బాగా తీస్తే బాగుంటుందని భావిస్తున్నారు? అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు. ఆయన ఏదో ఒక ఫ్లాప్ చిత్రం పేరు చెబుతాడని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం 'ఖైదీ' చిత్రం పేరు చెప్పాడు. ఆయన మాట్లాడుతూ, 'ఖైదీ' చిత్రాన్ని అనుకున్న స్థాయిలో తీయలేకపోయాం. ఈ చిత్రాన్ని ఇంకా బాగా తీసివుండవచ్చు. కానీ అంతగొప్పగా తీయలేకపోయామని తాపీగా జవాబిచ్చారు. మరి ఆ చిత్రంలో చిరుకి నచ్చని అంశాలు ఏమిటి? అంతకంటే ఆయన మెరుగ్గా తీయాలనుకుంటున్న పాయింట్స్ ఏమిటి? అనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.