'గమ్యం' నుండి 'కంచె' వరకు క్రిష్ చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తైతే తాజాగా ఆయన బాలయ్యతో చేసిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' మరో ఎత్తు, ఆయన ప్రతిభను గుర్తించి, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలనుకున్న తన 100వ చిత్రానికి బాలయ్య ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ బాలయ్యకు, తనకే కాదు.. యావత్ తెలుగు ప్రజలకు మరపురాని మహా అద్భుత చిత్రాన్ని, అందరూ గర్వపడే చిత్రాన్ని ఆయన అందించాడు. కమర్షియల్‌గా కూడా ఈ చిత్రం ఆయనకు దర్శకునిగా, నిర్మాతగా మైల్‌స్టోన్‌గా కలకాలం గుర్తుండిపోతుంది. ఈవిషయంలో ఆయన బాలయ్యకు ఎంతో రుణపడి ఉన్నాడనే చెప్పాలి. కాగా ఈ చిత్రంపై రాఘవేంద్రరావు నుంచి రాజమౌళి వరకు, చంద్రబాబు నుంచి వెంకయ్యనాయుడు వరకు అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఓ దర్శకుని జన్మధన్యం కావడానికి ఇంతకంటే ఏమి కావాలి? ఇక క్రిష్ తనను ప్రశంసిస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. కానీ ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తూ, బాలయ్య, క్రిష్‌లను అభినందిస్తూ వివాదాస్పద దర్శకుడు వర్మ ఎన్నో పొగడ్తలను కురిపించాడు. చిత్రం విడుదలకు ముందే ఆయన ఈ పరంపర మొదలుపెట్టాడు. ఇక చిత్రం రిజల్ట్ తెలిసిన తర్వాత వర్మ వారిని ఆకాశానికి ఎత్తేశాడు. కానీ ఈ చిత్రాన్ని పొగడటం వెనుక చిరు 'ఖైదీ..' చిత్రాన్ని తక్కువ చేసి చూపించాలనేది వర్మ అంతరంగం అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఉద్దేశ్యం ఏమైనప్పటికీ మొదటి నుంచి ఈ చిత్రంపై గొప్పగా ట్వీట్స్ చేస్తూ, చిత్ర ప్రమోషన్‌లో వర్మ కీలకపాత్ర పోషించాడనే చెప్పాలి. కానీ రాజమౌళి నుంచి అందరికీ తనను ప్రశంసించినందుకు కృతజ్ఞతలు చెబుతోన్న క్రిష్.. వర్మకి కృతజ్ఞతలు చెప్పడం మాత్రం మర్చిపోయాడు. దీనికి కారణం బహిరంగ రహస్యమే. ఎక్కడ వర్మకి కృతజ్ఞతలు చెబితే ఇక మెగాభిమానులు నుంచి మెగాక్యాంపులోని అందరూ ఆయనపై మండిపడతారో అనే. అందుకే పాపం.. క్రిష్ వర్మకు బహిరంగంగా కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నాడు. చివరకు ఆయన వర్మ పేరు ఎత్తితే మరలా ఎక్కడ కులం కంపులోకి తనను లాగుతారేమోనని భయపడుతున్నాడు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇప్పటికే క్రిష్ వర్మకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ థాంక్స్ చెప్పినట్లు తెలుస్తోంది.