సాధారణంగా తండ్రి ఆశలను, ఆశయాలను వారి కుమారులు నెరవేరుస్తూ ఉంటారు. టాలీవుడ్‌లోని ముఖ్యమైన ఫ్యామిలీలలో ఒకటైన మెగాఫ్యామిలీలో మాత్రం ఓ విచిత్రం జరుగుతోంది. దాంతో అది కాస్త విభిన్నమైన ఫ్యామిలీగా కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లో దాదాపు అరడజను హీరోలున్నారు. చిరుతోపాటు పవన్, బన్నీ, చరణ్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, అల్లు శిరీష్.. వంటి వారు ఉన్నారు. వీరందరిలోకి చిరు, పవన్‌లను పక్కనపెడితే వారి తర్వాత ఆ స్థాయిలో నటునిగా చరణ్ విజృంభిస్తాడని అందరూ భావించారు. కానీ చిరు మేనల్లుడైన అల్లుఅర్జున్ వరుస విజయాలతో, అన్ని తరహాల చిత్రాలను చేస్తూ మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్‌లో మంచి పాపులారిటీ సాధించాడు. వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రస్తుతం ఉన్న మెగాఫ్యామిలీ హీరోలలో చిరు, పవన్‌ల తర్వాత తానే నిలుస్తున్నాడు. ఇక చరణ్ కూడా మంచి విజయాలను నమోదు చేసినప్పటికీ మూస చిత్రాలు చేస్తాడని, కేవలం మాస్ ప్రేక్షకులను తప్ప మరో వర్గాన్ని మెప్పించలేకపోతున్నాడనే విమర్శలు వచ్చాయి.
తాజాగా 'ధృవ'తో పాటు ఆయన చేయబోయే సుకుమర్ చిత్రం నుండి ఇక ఆయన అన్ని జోనర్ చిత్రాలను చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయనపై ఇప్పుడిప్పుడే అందరిలో ఆసక్తి మొదలవుతోంది. మరోపక్క చరణ్ మేనమామ అయిన అల్లుఅరవింద్ నిర్మాతగా ఎంతో ఇమేజ్‌ను తెచ్చుకుని, సినిమాల జడ్జిమెంట్ నుంచి అన్నివిషయాల్లో మాస్టర్ బ్రెయిన్ అనే బిరుదును పొందాడు. ఇప్పుడు చరణ్ కూడా నిర్మాతగా మారి తన మొదటి చిత్రం తన తండ్రి మెగాస్టార్‌తో 'ఖైదీ..' చిత్రం చేసి తమ 'కొణిదెల' బేనర్‌ను మొదటి చిత్రంతోనే బాగా ఎస్టాబ్లిష్ చేశాడనే చెప్పాలి. అదే సమయంలో చిరు నటించే 151వ చిత్రానికి కూడా చరణే నిర్మాత కావడం గమనార్హం. ఈ చిత్రాల తర్వాత చరణ్ కేవలం మెగాఫ్యామిలీ హీరోలతోనే కాకుండా బయటి హీరోలతో కూడా చిత్రాలు చేయడానికి సిద్దమైపోతున్నాడు. ఇప్పటికే ఆయన అక్కినేని అఖిల్, శర్వానంద్‌లతో చిత్రాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. మొత్తానికి తన మేనమామ చిరు ఇమేజ్‌ను హీరోగా బన్నీ భర్తీ చేస్తుంటే, అల్లువారి అల్లుడు చరణ్ నిర్మాతగా దూసుకుపోనుండటం ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.