మెగాస్టార్ చిరంజీవికి సినిమా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని ఖైదీ నంబర్ 150 కలక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచే దిశలో ఈ సినిమాకు రెవెన్యూ వస్తోంది. ఇంత అభిమానగణం ఉన్న చిరంజీవి 2009 ఎన్నికల్లో ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 180 సీట్ల లక్ష్యంతో పోటీకి దిగితే కేవలం 6,820,845 ఓట్లు మాత్రమే దక్కి, 18 శాసనసభ స్థానాలకే పరిమితమైంది. పాలకొల్లులో పరాభవం ఎదురైంది. ఇప్పటికంటే చిరంజీవి పరిస్థితి అప్పుడు ఇంకా బెటర్ గా ఉంది. అయినప్పటికీ పార్టీకి దారుణమైన పరాజయం తప్పలేదు.
ఖైదీ.. సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆయనను కేవలం సినిమా హీరోగానే చూడడానికి అభిమానులు ఇష్టపడ్డారని స్పష్టమవుతోంది. ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే మాస్ హీరోగానే చూశారు కానీ పరిపాలకుడిగా కాదని అందుకే ఓటమితప్పలేదని అంటున్నారు. 2009లో వైయస్ ఆర్, చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ వంటి ఉద్దండరాజకీయ నేతలను ఎదుర్కొని ఓట్లు సాధించడం చిరంజీవికి కష్టమైంది. అన్నీ తానే అయి పార్టీని బరిలో నిలిపినప్పటికీ ఆయన సినిమా ఇమేజ్ ఓట్లు తేలేకపోయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. లేదా తనకున్న అభిమానగణాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో విఫలమై ఉండొచ్చు. ప్రజారాజ్యం పార్టీకి ఎదురైన ప్రతికూల వాతావరణం, కొందరు నాయకులు చేసిన విమర్శలు, టికెట్లు అమ్ముకున్నారనే అపవాదు వంటి వాటిని తిప్పికొట్టడంలో చిరంజీవి విఫలమవడం వల్లే ప్రతికూల ఫలితం ఎదురైందని ఆ వర్గాలు అంచనావేస్తున్నాయి.
ఖైదీ.. సినిమాకు లభిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ నేతలు సైతం అవాక్కవతున్నారు. గడచిన 2014 ఎన్నికల్లో ఆ పార్టీ చిరంజీవికి ప్రచార బాధ్యతలు అప్పగించింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. అంటే చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ ను ఆ పార్టీ సైతం సరిగా ఉపయోగించుకోలేదని స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే మాత్రం రాజకీయంగా ఆయన ఇమేజ్ ఉపయోగపడుతుందని వారు ఆశాభావంతో ఉన్నారు.