కొన్ని సినిమాలకు పనిగట్టుకుని ప్రచారం చేసే దర్శకరత్న దాసరి నారాయణరావు సంక్రాంతి పోటా పోటీ చిత్రాలపై మాత్రం తన స్పందన ఏమిటనేది చెప్పలేదు. చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సక్సెస్ రిపోర్ట్ తెచ్చుకున్నాయి. శాతకర్ణి మేకింగ్ పై ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు స్పందించారు. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు కూడా అభినందించాడు. దాసరి నుండి మాత్రం ఇంకా స్పందన రాలేదు. స్పందించకపోవడానికి కారణం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. చాలా సంవత్సరాలు ఎడముఖం పెడముఖంగా ఉన్న చిరంజీవితో ఈ మధ్యే దాసరికి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. 'కులం' కార్డుతో ఇద్దరు కలిశారు. 'ఖైదీ..' ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వెళ్ళి చిరంజీవిని పొగిడేశారు.
ఇక నందమూరి బాలకృష్ణతో దాసరికి మొదటి నుండి మంచి సంబంధం ఉంది. పైగా 'పరమవీరచక్ర' సినిమా వీరిద్దరి కలయికలో వచ్చింది. తెలుగువారి చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన 'శాతకర్ణి' సినిమాకు పాజిటివ్ గానే స్పందించాలి. 'శాతకర్ణి'ని అభినందిస్తే, చిరంజీవి కోటరికి కోపం రావచ్చు. పైగా భష్యత్తులో చిరంజీవితో రాజకీయంగా, కులపరంగా పనిచేయాల్సిన అవసరం దాసరికి ఉంది. ఈ కారణంగానే ఆయన స్తబ్దుగా ఉన్నారనే మాట వినిపిస్తోంది.
దర్శకుల ప్రతిభను ప్రశంసించే దాసరి వీలు చూసుకుని క్రిష్ కు అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇక చిరంజీవి గురించి చెప్పాల్సింది అంతా ప్రీ రిలీజ్ లో చెప్పేశారని వారు అభిప్రాయపడుతున్నారు.
సీనియర్ దర్శకుడు దాసరికి ఇలాంటి విపత్కర పరిస్థితి ఎప్పుడూ రాలేదని ఆయన శిష్యులు అంటున్నారు.