గత కొన్నాళ్ళుగా ఓవర్‌సీస్‌లో మన చిత్రాలకు మంచి ఆదరణ పెరుగుతూ వస్తోంది. దీనికి ఒక విధంగా శేఖర్‌కమ్ముల తన 'ఆనంద్'తో బీజం వేశాడని చెప్పవచ్చు. రాను రాను ఓవర్‌సీస్ మార్కెట్ విస్తరిస్తూ, ఏకంగా బాలీవుడ్ చిత్రాలతో కూడా పోటీపడే స్థాయికి ఎదగడం నిజంగా ఆనందించాల్సిన విషయం. ఇప్పుడు స్టార్‌హీరోల నుండి చిన్న హీరోలు కూడా తమ చిత్రాలను ఓవర్‌సీస్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఓవర్‌సీస్ ప్రేక్షకులు బాగా ఆదరించే కొత్త తరహా కథలతో, వైవిధ్యభరితమైన చిత్రాలతో, విభిన్నపాత్రలు చేస్తూ, ముఖ్యంగా అక్కడ బాగా ఆదరణ లభించే ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలు బాగా పెరగడానికి, పక్కా మాస్ మసాలా చిత్రాలను వదిలి కాస్త వెరైటీగా మన ఓవర్‌సీస్ ప్రేక్షకులు ఆదరించే విధంగా చిత్రాలు చేయడం మన హీరోలు మొదలుపెట్టారు. ఇంత కాలం కొత్త తరహా చిత్రాలను, ప్రయోగాత్మక చిత్రాలను ఎందుకు చేయడం లేదు? అని ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి చిత్రాలను తెలుగు ప్రజలు పెద్దగా ఆదరించరని, అందువల్లే తాము కేవలం కమర్షియల్ ఫార్ములా చిత్రాలనే తీస్తున్నామని వారిని వారు సమర్ధించుకునే వారు. కానీ నేడు ఆ మాటను వారు చెప్పలేకపోవడానికి కారణం కేవలం ఓవర్‌సీస్ ప్రేక్షకుల ఆదరణ వల్లనేనని, ఈ విధంగా మన దర్శకనిర్మాతల, స్టార్ హీరోల ఆలోచనాధోరణిని మార్చిన ఘనత ఓవర్‌సీస్ ప్రేక్షకులకే దక్కుతుందనడంలో సందేహంలేదు. చివరకు పక్కా మాస్ చిత్రాలు చేసే ఎన్టీఆర్, చరణ్ వంటి వారు కూడా ఇప్పుడు విభిన్న చిత్రాలను ఎంచుకోవడానికి ముందుకు రావడం అభినందనీయం.
ఇక మన స్టార్స్ తమ చిత్రాల విడుదల సందర్భంగా కేవలం నామమాత్రపు ప్రమోషన్‌తో సరిపెట్టకుండా విదేశాలకు కూడా వెళ్లి, దానికి సమయం కేటాయిస్తు అక్కడ కూడా ప్రమోషన్ చేసే పరిస్థితి కల్పించినందుకు.. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు రిలీఫ్ ఇచ్చినందుకు మన దేశంలోని తెలుగువారందరూ ఎన్నారైలకు రుణపడి ఉండాలని చెప్పడం కూడా అతిశయోక్తికాదనేది వాస్తవం. ఇక నిన్నటివరకు ఓవర్‌సీస్‌లో పెద్దగా పట్టులేని చరణ్, ఎన్టీఆర్‌లతో పాటు చివరకు సీనియర్ హీరోల మనస్తత్వం మారడానికి వారే ముఖ్యకారకులు. పవన్ నటించిన 'సర్దార్', మహేష్ నటించిన 'బ్రహ్మోత్సవం, 1(నేనొక్కడినే)' వంటి డిజాస్టర్ చిత్రాలు కూడా అక్కడ అద్భుతమైన ప్రీమియర్‌షోల కలెక్షన్లు, ఓపెనింగ్స్‌తో భారీ వసూలు సాధించాయి. ఇక చిరు నటించిన 'ఖైదీ..', బాలయ్య 'గౌతమీపుత్ర' వంటి చిత్రాలతో పాటు దిల్‌రాజు నిర్మించిన శర్వానంద్ 'శతమానం భవతి' చిత్రానికి కూడా ఓవర్‌సీస్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఏ హీరో సినిమా ఎంత కలెక్ట్ చేసింది...? అనే లెక్కల్లోకి వెళ్లకుండా, కేవలం ఓవర్‌సీస్ మార్కెట్‌నే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తున్న 'శతమానం...' వంటి చిత్రాలను ఆదరిస్తున్న ఓవర్‌సీస్ ప్రేక్షకులకు తెలుగు సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలుపుకోవాలి.