మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో దర్శకుడు వినాయక్ ను ఆకాశానికెత్తేశారు. సమర్థుడని కితాబునిచ్చారు. దానికి తగినట్టుగానే వినాయక్ శ్రమించి 'ఖైదీ నంబర్ 150' చిత్రాన్ని బాక్సాఫీస్ హిట్ కు చేర్చారు. నాగార్జున వారసుడితో తీసిన 'అఖిల్' సినిమా నిరాశపరిచినప్పటికీ వినాయక్ కు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. గతంలో రీమేక్ కథతో తీసిన ఠాగూర్ హిట్ కావడమే అవకాశం లభించడానికి కారణమనేది తెలిసిందే. చిరంజీవి రీ ఎంట్రీ సినిమాకు కావాల్సిన మసాలాలు అన్నీ జోడించి తీసిన ఖైదీ విజయంలో వినాయక్ కీలక పాత్రధారిగా మారారు. చిరంజీవి మాస్ ఇమేజ్ పెంచిన ఎ.కోదండరామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకులకు దక్కని అవకాశం వినాయక్ పొందాడు.
వినోదాన్ని, కమర్షియల్ అంశాలను జోడించి తీయగల నేర్పరి వినాయక్. అందుకే ఖైదీని డైరెక్ట్ చేయగలిగాడు. ఇప్పుడు సినిమా రిలీజై హిట్ అయింది. కేవలం చిరంజీవిని మళ్లీ చూడ్డానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారా? లేక కథలో బలం ఉందా? అని సినీ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కథలో బలం ఉందని భావిస్తే మాత్రం ఆ క్రెడిట్ కచ్చితంగా వినాయక్ కే చెందుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఆయనకు లైఫ్ అండ్ డెత్ లాంటిది. ఫలితం ఏ మాత్రం తారుమారైనా సరే కెరీర్ గందరగోళంలో పడుతుంది. అందుకే శక్తివంచన లేకుండా హోం వర్క్ చేశాడు. బృంద రచయితలతో ఎప్పటికప్పుడు చర్చించాడు. మెగా ఇమేజ్ ను తెరపై ఆవిష్కరించడానికి విశ్వప్రయత్నం చేసి విజయం అందుకున్నాడు. కాబట్టి ఇది వినాయక విజయమే అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.