చరిత్రను తెరకెక్కించే ముందు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చరిత్రను వక్రీకరించకూడదు. ముఖ్యంగా నాటి జీవన విధానాన్నిపరిశోధించి చూపించాలి. ఇంత కసరత్తు జరిగితే కానీ పురాణపురుషుల కథలకు న్యాయం జరగదు. లేదంటే అభాసుపాలు అవకతప్పదు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ విషయాలను మరిచినట్టు కొందరికి అనుమానం కలుగుతోంది. ఆయన తాజా చిత్రం 'నమో వేంకటేశాయ' సినిమాను స్వామిభక్తుడైన హాథీరామ్ బాబా కథతో తీస్తున్నారు. బాబా సుమారు 500 సంవత్సరాల క్రితం జీవించి, వేంకటేశ్వరస్వామితో పాచికలు ఆడాడని ప్రచారంలో ఉంది. ఉత్తర భారతానికి చెందిన హాథీరామ్ గిరిజన తెగకు చెందిన వ్యక్తి. హాధీరామ్ ను తమ తెగకు చెందిన వ్యక్తిగా లంబాడిలు భావిస్తుంటారు. ఇప్పటికీ తిరుమలలో హాథిరామ్ భవన్ ఉంది. ఇక్కడ లంబాడి తెగకు ఉచిత వసతి, భోజనం కల్పిస్తున్నారు.
నాగార్జున టైటిల్ పాత్రని చేస్తున్న 'నమో వేంకటేశాయ' గెటప్స్ చూస్తుంటే కెఆర్ఆర్ వాస్తవ పరిస్థితులను పక్కదోవ పట్టిస్తున్నారని చరిత్ర కారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన తెగకు చెందిన వ్యక్తి ఆహార్యాన్ని గ్లామరైజ్ చేశారు. ఇతర పాత్రధారుల వస్త్రధారణ సైతం వాస్తవానికి దూరంగా ఉంది. అన్నమయ్య భక్తుడి కథని తీస్తూ అదే టైటిల్ పెట్టి, హాథీరామ్ బాబా పేరును మాత్రం మార్చేశారు. ఇంకా ఐదు శతాబ్దాల క్రితం ఆవాసాలను సైతం మార్చేశారనే ఆరోపణలున్నాయి.
దర్శకేంద్రుడు తనదైన గ్లామర్ మాయాజాలంతో పురాణపురుషుల జీవనశైలిని మార్చేస్తే అది వివాదం అయ్యే ప్రమాదం ఉంది. భక్తి చిత్రాలు తీయాలనే ఆయన తపనను అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ పేరుతో వక్రీకరిస్తే మాత్రం ప్రమాదమే.
'త్యాగయ్య', 'భక్తపోతన', 'భక్తతుకారం', 'మహాకవి క్షేత్రయ్య', 'చక్రధారి', 'భక్త కన్నప్ప' వంటి భక్తుల కథలను తెరకెక్కించినపుడు ఆయా దర్శకులు చరిత్రను శోధించి, నాటి జీవన విధానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారనే విషయాన్ని దర్శకేంద్రుడు గుర్తుంచుకుంటే మంచిది.