తన మొదటి చిత్రం 'గమ్యం' నుండి 'కంచె' వరకు అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్రియటివ్ డైరెక్టర్.. క్రిష్. కాగా ఆయనకు ఈ చిత్రాలు మంచి పేరునే కాదు.. అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాలలో ఆయన దాదాపు అన్ని చిత్రాలను తన సొంతంగానే నిర్మించాడు తప్ప ఇతర నిర్మాతలను ఇబ్బందిపెట్టలేదు. కాగా సరైన కమర్షియల్ హిట్‌లేని క్రిష్‌కు బాలయ్య రూపంలో 'గౌతమీపుత్ర..' అవకాశం వచ్చింది. దాన్ని చక్కగా ఉపయోగించుకున్న క్రిష్ కమర్షియల్‌గా కూడా పెద్ద హిట్టును కొట్టాడనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన చేయబోయే తదుపరి చిత్రంపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇప్పటికే మెగాఫ్యామిలీ హీరోలైన బన్నీ, వరుణ్‌తేజ్‌లతో ఆయన చిత్రాలు చేశాడు. ఆ తర్వాత మరలా వరుణ్‌తేజ్‌తోనే 'రాయబారి' అనే స్పై చిత్రం చేయాలని భావించినా ఆ చిత్రం పట్టాలెక్కలేదు.
కాగా ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్‌గా కూడా పేరు తెచ్చుకోవడంతో అదే 'రాయబారి' కథను చరణ్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా చరణ్ ఈమధ్య సుక్కు చిత్రం తర్వాత మరో రెండు చిత్రాలు ఒప్పుకున్నానని అందులో ఒకటి స్పై థ్రిల్లర్ అని తెలిపాడు. కాగా ఇది క్రిష్ దర్శకత్వంలోనే రూపొందనుందని ప్రచారం మొదలైంది. కానీ కొందరు మాత్రం చరణ్ చేయబోయే గూఢచారి చిత్రం గౌతమ్‌మీనన్‌తో ఉంటుందని అంటున్నారు. కాగా 'కంచె' చిత్రాన్ని క్రిష్ రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హీరోని సైనికుడిగా చూపించాడు. కాగా క్రిష్ చేయబోయే తదుపరి చిత్రంలో హీరో ఎవరైనా కూడా ఈ కథ కూడా యుద్దం నేపథ్యంలో స్పైథ్రిల్లర్‌గా ఉండటం ఖాయం అంటున్నారు. మరి ఈ చిత్రంలో ఆ గూఢచారి పాత్రను చరణ్ చేస్తాడా? వెంకీ చేస్తాడా? లేక మరో హీరో నటిస్తాడా? అనేది తెలియాలంటే కొద్ది కాలం వెయిట్ చేయకతప్పదు.