కింగ్ నాగార్జున విభిన్నంగా ఉండే ఏ చిత్రాన్ని వదలడు. నేటితరం హీరోల్లో తన భక్తిరస చిత్రాలను కూడా చేసి నేటితరం వారికి అలాంటి భక్తి భావాలను పెంచిన హీరోగా నాగ్ చరిత్రలో మిగిలిపోతాడు. కాగా ఆయన 'అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి' వంటి చిత్రాల తర్వాత మరోసారి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న శ్రీవేంకటేశ్వరస్వామి పరమభక్తుడు హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి10న విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రం ఆడియో వేడుకలో నాగ్ రచయిత జె.కె.భారవి తనకు ఓ కథను వినిపించాడంటూ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా భక్తిరస చిత్రాల రచయితగా జె.కె.భారవికి మంచి అనుభవం ఉంది. ఆయన ఆల్‌రెడీ దర్శకుడు కూడా. త్వరలో ఆయన నాగ్ హీరోగా మరో భక్తిరస చిత్రానికి కథను రెడీ చేశాడట. అది ఇస్కాన్‌ఫౌండర్ శ్రీప్రభుపాద జీవిత చరిత్ర అని తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన జీవిత కథను తయారు చేసిన భారవి ఆ కథను నాగ్‌కి వినిపించి ఓకే చేయించాడట. నాగ్ ఖచ్చితంగా ఈ చిత్రాన్ని చేస్తామంటే ఇస్కాన్‌ఫౌండేషనే ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నద్దం అవుతోంది.
ఇక ఎప్పటి నుంచో కొందరు నాగ్‌తో 'ఏసుక్రీస్తు' జీవిత చరిత్రను తీయాలని హాలీవుడ్ రేంజ్‌లో తీయాలని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగ్ ఒప్పుకుంటే పలు క్రిస్టియన్ మిషనరీలు నిర్మించడానికి రెడీగా ఉన్నాయి. అయితే గతంలో నటుడు విజయ్‌చందర్ అత్యద్భుతంగా నటించిన 'శిరిడీ సాయి' పాత్రలో నాగ్‌ను విజయ్‌చందర్‌తో పోల్చిచూసి, బాగాలేదని భావించడంతో 'శిరిడిసాయి' చిత్రం పెద్దగా ఆడలేదు. ఇక ఏసుక్రీస్తుగా కూడా విజయ్‌చందర్ ఎప్పుడో 'కరుణామయుడు' చిత్రం చేసి ఘనవిజయం సాధించాడు. మరి నాగ్ జీసస్ పాత్రను పోషిస్తే మరోసారి విజయ్‌చందర్‌తో పోల్చిచూసే అవకాశం ఉండటంతో ఇప్పటివరకు ఈ చిత్రాన్ని ఎటూ తేల్చడంలేదని తెలుస్తోంది. ఇక నాగ్ మరోసారి తనను అందరూ ఎందుకు జెంటిల్‌మేన్ అంటారో నిరూపించుకున్నాడు. ఈ సంక్రాంతికి చిరు, బాలయ్యలతో పోటీ పడి వస్తున్న శర్వానంద్‌పై ఆయన ఎంతో నమ్మకం వ్యక్తం చేశాడు. ఎప్పుడైనా దమ్ము, కీర్తి కలిసి పనిచేస్తాయి. నీకు దమ్ముంది. కిందటి ఏడాది కూడా ఇదో దమ్ము చూపించి, సక్సెస్ అయ్యావు... ఈ ఏడాది కూడా నువ్వు అలాగే చేయాలని శర్వానంద్‌కు విషెష్ చెబుతూ, నేడు విడుదల కానున్న 'శతమానంభవతి'పై నమ్మకం వ్యక్తం చేశాడు.