బాలకృష్ణ 'శాతకర్ణి'గా, క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కళాఖండం 'గౌతమీపుత్ర శాతకర్ణి' పై ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఈ చిత్రాన్ని క్రిష్ అత్యద్భుతంగా తెరకెక్కించాడని, యుద్ద సన్నివేశాలతో పాటు సినిమా మొత్తం విజువల్ వండర్‌లాగా ఉందని, బాలయ్య 'శాతకర్ణి'గా అదరగొట్టాడనే ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి ఈచిత్రంపై ఎన్నో ప్రశంసలు గుప్పించాడు. రాజమౌళి అలా స్సందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చారు. బాలయ్య గారి ప్రోత్సాహంతోనే ఈ చిత్రాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేయగలిగానని వినమ్రంగా ప్రకటించాడు. కాగా ఈ చిత్రాన్ని చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. అఖండ భారతదేశాన్ని ఏలిన 'శాతకర్ణి' మన తెలుగువాడు. ఈ చిత్రంలో గౌతమీపుత్ర శాతకర్ణిగా అత్యద్భుతంగా నటించిన బాలయ్య తెలుగువాడు. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ తెలుగువాడు. ఇలా ఈ చిత్రం తెలుగువాడి సత్తాను ప్రపంచానికి చాటింది. సాటి తెలుగువాడినైన నేను ఈ చిత్రం చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నానని తెలిపాడు. ఇక ఈ చిత్రంలో ఉత్తరభారతాన్ని పాలించే రాజు సహపాణుడిపై శాతకర్ణి యుద్దం ప్రకటించడం, సహపాణుడు శాతకర్ణి కుమారుడిని బంధించి, మెడపై కత్తి పెట్టి తనకు లొంగిపోవాలని, తనకు సామంతునిగా శాతకర్ణి మారాలని లేకపోతే కుమారుడిని చంపేస్తానని బెదిరించడం, ఆపై శాతకర్ణి చూపించే పౌరుషం వంటి సీన్స్‌కు ప్రాంతాలకు అతీతంగా అందరిచేతా వావ్.. అనిపిస్తోంది.