బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర...' చిత్రం విజయంతో ఆయన అభిమానులందరూ సంతోషపడుతుంటే ఓ అభిమాని మాత్రం పొంగిపోతోంది. ఆమె రచయిత్రి కూడా. ఆమె పేరు అభిలాష. బాలయ్య నటిస్తున్న శతచిత్రం కావడంతో ఆమె బాలయ్యను పొగుడుతూ 'శతచిత్రతారా.. తారకరామపుత్ర..' అంటూ ఓ పాటను రాసి, డైరెక్ట్ చేసింది. ఇటీవల ఈ చిత్రం విడుదలకు ముందు బాలయ్య అభిమానులు ప్రసాద్‌ల్యాబ్స్‌లో పెట్టుకున్న మీటింగ్‌లో కూడా ఈ పాటను ప్లే చేశారు. ఈ పాటని విని ముగ్డుడైన బాలయ్య ఆమెకు ఫోన్ చేసి అభినందించి, ఆ పాటను అభిమానులంతా రింగ్‌టోన్స్‌గా పెట్టుకున్నారని చెప్పడంతో ఆమె ఉప్పొంగిపోతోంది. 'గౌతమీపుత్ర' విడుదల సందర్బంగా డెన్మార్క్‌లోని థియేటర్‌లో కూడా సినిమాకు ముందు ఈ పాటను ప్లే చేశారని సమాచారం. కాగా ఈ చిత్ర విజయాన్ని ముందే ఊహించిన హీరో నితిన్, ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డిలు ప్రారంభంలోనే నైజాం రైట్స్‌ని అతితక్కువ ధరకే అంటే 11.25కోట్లకు సొంతం చేసుకున్నారు. వారి అంచనాలు నిజమై సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో నితిన్‌కు 'అఖిల్' ద్వారా వచ్చిన నష్టాన్ని 'గౌతమీ..' చిత్రం పూడుస్తోందని ఆనందంగా ఉన్నారు. మొత్తానికి కలెక్షన్లపరంగా చిరు 'ఖైదీ' బాగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. 10ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు చేసిన చిత్రం కావడం ఆ చిత్రానికి ప్లస్ కానుంది. కానీ ఈ సినిమాను భారీ రేట్లకు అమ్మారని, బాలయ్య 'గౌతమీ..'ని మాత్రం పరిధుల మేరకే అమ్మడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడంతో కొన్న బయ్యర్లు, నిర్మాతలు కూడా భారీగా లాభపడుతారని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి.