సాధారణంగా ఎవరికైనా తిక్క పుడితే విమర్శిస్తారు.. కొందరు పొగుడుతారు. కానీ 24 గంటలూ తిక్కలో ఉండే వర్మ రూటే సపరేట్. ఆయన తనపై తాను సెటైర్లు వేసుకోవడమే కాదు...మోదీ నుంచి కేసీఆర్ వరకు, ట్రంప్ నుండి బచ్చన్ వరకు అందరిపై తిడుతున్నాడో, పొగుడుతున్నాడో అర్ధంకాని రీతిలో సెటైర్లు వేస్తుంటాడు. ఇక పెద్దలు ఓ మోటు సామెత చెబుతారు. నిద్రపోయే గాడిదను.... అన్నట్లుగా అనవసరంగా నాగబాబు వర్మను ఏవేవో తిట్టాడు. దాంతో ఇక అసలే తిక్క ఉండే వర్మకి అది పీక్స్‌కి చేరింది. ఇక 'ఖైదీ' చిత్రం విడుదల రోజు మౌనం వహించిన వర్మ 'గౌతమీపుత్ర...' రిజల్ట్ తెలిసిన వెంటనే మరలా తన సెటైరిక్ వార్ కొనసాగిస్తూ, మెగాభిమానుల్లో సెగపుట్టిస్తున్నాడు. 'ఖైదీ'నే ఆయన ప్రస్తుతం టార్గెట్ చేస్తున్నాడు. 'గౌతమీపుత్ర'తో బాలయ్య, క్రిష్‌లు అదరగొట్టారన్నాడు. 100చీర్స్ టు క్రిష్ అండ్ బాలయ్య అంటూ ట్వీట్ చేశాడు. ఆ వెంటనే బాలయ్య 100వ చిత్రం మెగామూవీ కంటే 150రెట్లు బాగుందంటూ ప్రశంసించాడు. అరువు తెచ్చుకున్న కథతో ఓ స్టార్ తెలుగు సినిమాను ఓ 10ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని, కానీ మరో హీరో యదార్ధ సంఘటనలతో తెలుగు సినిమా స్థాయిని మరో 10ఏళ్ల ముందుకు తీసుకొని వెళ్లాడని, క్రిష్ నా నమ్మకాన్ని నిలబెట్టాడంటూ శాతకర్ణిని పొగడ్తలతో ముంచెత్తుతూ, ఖైదీని ఏకిపారేస్తున్నాడు. దీంతో పూర్తిగా మెగాఫ్యామిలీతో పాటు మెగాభిమానులు కూడా ఆగ్రహంగానే ఉన్నా.. దీనిపై స్పందిస్తే వర్మ మరెంతగా రెచ్చిపోతాడనే భయంతో మౌనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.