శాతకర్ణి సినిమా తర్వాత బాలకృష్ణ శకం మొదలవుతుంది అని విడుదలకు ముందు చెప్పిన మాట నిజమైంది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేయడమే సాహసమైతే, అది తన కెరీర్ కు వందవ సినిమాగా ఎంచుకోవడం బాలకృష్ణ తొలి సక్సెస్. కేవలం 2.15 నిమిషాల్లో తెలుగు వారి చరిత్రను చెప్పేశారు. గ్రాఫిక్స్ పేరుతో కాలయాపన చేయకుండా, ఎనిమిది నెలల్లో సినిమాను పూర్తిచేసిన దర్శకుడు క్రిష్ ను అభినందించాలి. నేటి తరానికి సైతం నచ్చే విధంగా సంభాషణలు రాసిన బుర్రా సాయిమాధవ్ ప్రశంసనీయమైన పాత్ర పోషించాడు.
సినిమా కెరీర్ అనేది ఎంతో అదృష్టం చేసుకుంటేకానీ రాదు. అలాంటి కెరీర్ లో మైలురాళ్ళుగా నిలిచే చిత్రాల్లో నటిస్తే భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయి. చరిత్రలో స్థానం లభిస్తుంది. అభద్రతా భావంతో కమర్షియల్ చిత్రాలు చేస్తే స్టార్ గా నిలబడతారేమో కానీ చరిత్రలో కాదు. నటుడు అనేవాడు అద్భుతమైన క్యారెక్టర్ లు చేసి మెప్పించాలి. ఎన్టీఆర్, అక్కినేని అలాంటి పాత్రలు చేశారు కాబట్టి నిలిచిపోయారు. ఈ కోవలో శాతకర్ణి సినిమా అందులో నటించిన బాలకృష్ట కూడా నిలుస్తారు.