ఇది బయోపిక్ ల సీజన్. ఇప్పటికే బాలీవుడ్ లో అనేక బయోపిక్ సినిమాలు వచ్చి విజయం సాధించాయి. దాంతో చాలా మంది దర్శకులకు ఇలాంటి సినిమాలు తీయాలనే ఆలోచన కలుగుతోంది. ఇటీవలే మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై సినిమా రూపొందించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. జయలలిత జీవితంలో సినిమాకు కావాల్సిన ట్విస్ట్ లు అనేకం ఉన్నాయి. తమిళ రాజకీయాలను శాసించిన ఆమె బయోపిక్ తీయడానికి తమిళ, తెలుగు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి జయలలిత పాత్ర ఎవరు ధరించాలి? ఇది ఆసక్తికరమైన ప్రశ్న. కోమలత్వం, పొగరుబోతుతనం, శాంతిస్వభావం వీటిని ప్రదర్శించగల సత్తా ఎవరిలో ఉంది? అనే దర్శకులతో పాటుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. కొంతరైతే జయలలిత పాత్రని సీనియర్ నటి రమ్యకృష్ణ చేస్తేనే బావుంటుందనే అభిప్రాయంతో ఉన్నారట. నాయకత్వ లక్షణాలు, పొగరుబోతుతనం రమ్య సొంతం. పైగా వయసు కూడా సరిపోతుంది. తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. 'బాహుబలి'లో శివగామిగా అద్భుతమైన పర్ ఫార్మెన్స్ ఇచ్చింది. దాదాపుగా జయలలిత పాత్రకూడా శివగామిని పోలి ఉంటుంది కాబట్టి రమ్యకృష్ణ మాత్రమే జయలలిత పాత్రకి న్యాయం చేయగలదని భావిస్తున్నట్టు సమాచారం.