ఎంతో కాలంగా సీడెడ్‌లో ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా మంచి అనుభవం ఉండి, తాజాగా నిర్మాతగా మారి, అభిరుచిగల చిత్రాల నిర్మాతగా, అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి. కాగా ఆయనకు బాలయ్యతో మంచి స్నేహం ఉంది. బాలయ్య నటించే తన 100వ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఆయనకే ఇస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత దర్శకుడు క్రిష్, రాజీవ్‌రెడ్డిలే నిర్మాతలుగా 'గౌతమీపుత్ర....' చేశాడు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం మంచి ఊపుమీదనే ఉంది. ఇక తాజాగా సాయికొర్రపాటి మాట్లాడుతూ, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తొలి చిత్రం తమ బేనర్‌లోనే నిర్మించేందుకు బాలయ్య ఒప్పుకుని మాట ఇచ్చారు. మోక్షజ్ఞ తొలి చిత్రం చేయడం తమకు ఓ మైలురాయి వంటిదని తెలిపాడు. ఆ రోజు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నానని, 'గౌతమీ...' చిత్రంలో బాలయ్య పాత్రను మరెవ్వరూ చేయలేరన్నాడు. రాజుగా శాతకర్ణి అంత గొప్ప వ్యక్తిత్వం, రాజసం, మంచితనం ఉండే ఒకే ఒక్క హీరోగా బాలయ్యకు కూడా ఆ లక్షణాలున్నాయని, తండ్రి ఎన్టీఆర్‌లాగా ముక్కుసూటితనం, కల్మషం లేకుండా ఉంటారని, నిజాయితీకి బాలయ్య మారుపేరని కొనియాడారు. తాను ప్రతి విషయంలోనే బాలయ్య సలహాలను, సూచనలను పాటిస్తానని, ఆయన ఎంతో మంచి సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పడంతో ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో ఆనందోత్సాహాలు పొంగిపొర్లుతున్నాయి.