వాస్తవానికి తన కెరీర్ మొదట్లో యాక్షన్ అండ్ ఎమోషనల్ స్టోరీలను తనదైన శైలిలో రంజింపజేసే విధంగా జక్కన్న చిత్రాలు చేశాడు. కానీ ఎన్టీఆర్‌తో చేసిన 'యమదొంగ' నుంచి ఆయనకు గ్రాఫిక్స్ చీమ కుట్టింది. ఇక 'మగధీర, ఈగ' చిత్రాలతో అది పీక్స్‌కి చేరింది. ఇక 'బాహుబలి'తో ఆయన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఈ చిత్రం సెకండ్‌పార్ట్‌ను అంతకు వందరెట్లు ఎక్కువగా విజువల్ వండర్‌లా చెక్కుతున్నాడు. తాజాగా ఆయన ఇండియాటుడేతో మాట్లాడినప్పుడు మరోసారి తన డ్రీమ్‌ప్రాజెక్ట్ అయిన 'మహాభారతం' గురించి చెప్పుకొచ్చారు. మహాభారతంలోని ప్రతి ఉపకథ, ప్రతిపాత్ర తనను ఎంతగానో స్పందింపజేస్తాయని, అది మహా అద్భుతమైన గ్రంథమని చెప్పారు. దాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెలిపిన ఆయన ఆ చిత్రాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో మాత్రం చెప్పలేదు. దీంతో మరోసారి జక్కన్న రెగ్యులర్ చిత్రాలకు, మరీ ముఖ్యంగా టాలీవుడ్‌కి దూరమవుతారనే రూమర్లు నిండిపోయాయి. ఇక 'బాహుబలి' చిత్రాన్ని మరో 30ఏళ్లపాటు చరిత్రలో నిలిచిపోయేలా తెరకెక్కించే పనిలో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చాడు.