సాధారణంగా చిరు నటించే చిత్రాల కథ, టెక్నీషియన్స్‌తోపాటు ఇతర నటీనటులు ఎంపిక, షూటింగ్ నుండి చిత్రం విడుదల వరకు అన్నీ అల్లు అరవిందే చూసుకుంటాడు. ఇక 'ఖైదీ...' చిత్రం ప్రత్యేకమైన మూవీ కాబట్టి ఈ చిత్రాన్ని ఆయన తనయుడు చరణ్ నిర్మించాడు. మేకింగ్, బడ్జెట్ వంటి విషయాలను అల్లు కేవలం చరణ్‌కే వదిలేశాడట. ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. కానీ రిలీజ్ విషయంలో మాత్రం ఆయన కేవలం థియేటర్ల వరకు మాత్రమే చూసుకున్నాడని సమాచారం.
ఇందులో కూడా ఆయన పెద్దగా యాక్టివ్‌నెస్ చూపకపోవడం, బయ్యర్లుగా ఎవరిని ఎంచుకోవాలి? ఏ రేటుకు అమ్మాలి..? వంటి బిజినెస్ వ్యవహారాలు చరణ్‌కు కొత్త కావడంతో ఆయన చాలా ఇబ్బందులే పడ్డాడంటున్నారు. అలాంటి సమయంలో విషయం తెలుసుకున్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఈ చిత్రం తన అన్నయ్యకి ప్రత్యేక మూవీ కావడం, చరణ్ నిర్మాతగా కొత్త కావడం, అల్లు పెద్దగా పట్టించుకోకపోవడంతో తన ఆప్తమిత్రుడైన శరత్‌మరార్‌ను ఆగమేఘాల మీద పంపి, చరణ్‌కు తోడ్పాటునందించాడని విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో అల్లు పెద్దగా జోక్యం చేసుకోవడం కూడా పవన్‌కు ఇష్టంగానీ, ఆయనపై నమ్మకం గానీ లేకపోవడం వల్లే పవన్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.