చిన్నవంశీగా గుర్తింపు పొందిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. కాగా మాయల ఫకీరు ప్రాణాలన్నీ చిలకలో ఉన్నట్లు.. ఇప్పుడు ఆయన ప్రాణాలన్నీ వర్మలోనే ఉన్నాయి. ఈయన బాలయ్యతో 'రైతు' చిత్రం చేయాల్సివుంది. కాగా ఇది బాలయ్య 101వ చిత్రం అవుతుందని అందరూ భావించారు. కానీ బాలయ్య మాత్రం దానికి ఓకే చెబుతూనే ఆ చిత్రంలోని కీలకపాత్రకు బిగ్‌బి అమితాబ్ ఒప్పుకుంటేనే ఆ చిత్రం చేస్తానని, లేదంటే మరో చిత్రం గురించి ఆలోచిస్తానని తెగేసిచెప్పాడు. ఇందులో అమితాబ్ పాత్ర కీలకమే అయినా అది కేవలం ఐదునిమిషాల పాత్రేనని, దానికి ఓ మూడు నాలుగు రోజులు కాల్ లిస్ట్ ఇస్తే సరిపోతుందని సమాచారం. ఆమధ్య బాలయ్య స్వయంగా కృష్ణవంశీతో కలిసి 'సర్కార్3' సెట్స్‌కి ప్రత్యేకంగా వెళ్లి రిక్వెస్ట్ చేసినా, ఆయన తన ఆరోగ్యరీత్యా, బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేనని మొహం మీద చెప్పేశాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దాంతో ఈ చిత్రం హోల్డ్ లో పడింది. మరోసారి బాలయ్య చిన్నవంశీకి అదే షరత్తు విధించడంతో ఆయన తన గురువైన వర్మ మీదనే ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్‌లోని నేటితరం దర్శకుల్లో బిగ్‌బి ఎక్కువగా విలువనిచ్చేది వర్మకే. ఇక కృష్ణవంశీ తన శిష్యుడే కావడం, సినిమా బాలయ్యది కావడంతో వర్మ కూడా అమితాబ్‌ను ఈ విషయంలో ఒప్పిస్తాడనే ఆశతో బాలయ్య ఉన్నాడంటున్నారు. మరి నాగార్జునకు 'ఖుదాగవా' నుండి పరిచయం ఉండటం, నాగ్‌తో కలిసి బిగ్‌బి కొన్ని యాడ్స్ చేయడంతో పాటు ఏయన్నార్ కొడుకనే గౌరవంతో ఆయన 'మనం' చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. మరి ఏయన్నార్ కోసం ఆ చిత్రంలో నటించిన ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ కొడుకనే గౌరవంతోనైనా ఈ చిత్రానికి అంగీకారం తెలపకపోతాడా? అనే ఆశతో నందమూరి అభిమానులు ఉన్నారు.