త్వరలో మంచు హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. విష్ణు, మనోజ్‌లు హీరోలుగా మారి సంవత్సరాలు గడుస్తున్నా కూడా వారికంటూ ఓ ఇమేజ్ రాకపోవడం గమనార్హం. అయినా కూడా వారు ఘజనీ మొహ్మద్‌లా దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మంచు విష్ణు ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా 'గీతాంజలి' ఫేమ్ రాజ్‌కిరణ్ దర్శకత్వంలో తనకు కలిసివచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో 'లక్కునోడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో ఆయనకు కాస్త కలిసొచ్చిన హీరోయిన్ హన్సిక నటిస్తోంది. ఇటీవలే ఆడియో వేడుక జరుపుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదలకు సిద్దమవుతుండగా, మంచు విష్ణు త్వరలో 'అడ్డా' ఫేమ్ కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు విష్ణు కన్నా నటనలో కాస్త బెటర్ అనిపించుకున్న ఆయన సోదరుడు మంచు మనోజ్ మరోసారి తనకు కాస్తోకూస్తో కలిసివచ్చిన వైవిధ్యభరిత చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రగ్యాజైస్వాల్‌తో కలిసి 'గుంటూరోడు' చిత్రంతో పాటు 'ఒక్కడు మిగిలాడు' అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. 'గుంటూరోడు'చిత్రం ట్రైలర్ ఈరోజు(బుధవారం) ఉదయం 9గంటలకు విడుదలైంది. త్వరలో ఆడియో వేడుక కూడా జరిపి ఫిబ్రవరి చివరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది ప్రథమార్థంలోనే మంచు హీరోలు నటించిన నాలుగు చిత్రాలు విడుదల కావడం గ్యారంటీ అంటున్నారు. మరి ఈ చిత్రాలైనా వీరికి ప్రత్యేక గుర్తింపును తెచ్చి హిట్లు ఇస్తాయని, ఈ ఏడాది తమకు కలిసివస్తుందని మంచుఫ్యామిలీ భావిస్తోంది.