వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవి వైపు ఆశగా చూస్తోందా? రాజకీయ సమీకరణలో భాగంగా ఆయనను ఆకర్షించే ప్రయత్నం చేస్తోందా? ఈ ప్రశ్నలకు రాజకీయ వర్గాలు కొంతసానుకూలంగా స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్న చిరంజీవిని తమవైపు తెచ్చుకుంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు, బిజెపి కూటమిని, పవన్ కల్యాణ్ జనసేనకు చెక్ పెట్టవచ్చనే ఆలోచనతో వైకాపా పావులు కదుపుతోందని ఆ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఒకప్పుడు చిరంజీవిని దుమ్మెత్తిపోసిన రోజా ఇందుకు తొలి అడుగు వేసింది. ఖైదీ నంబర్ 150 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రోజా చేత సాక్షి ఛానల్ చిరంజీవిని ఇంటర్య్వూ చేయించింది. శాసనసభ్యురాలిగా ఉన్న రోజా జర్నలిస్ట్ పాత్రని సమర్థవంతంగా పోషించింది. వీరిద్దరి పునపరిచయం రాబోయే రాజకీయ ఎత్తుగడలకు నాంది అవుతుందని భావిస్తున్నారు. చిరంజీవి, రోజా ములాఖత్ వ్యూహాత్మకంగా జరిగిందే అని అంటున్నారు. ముఖ్యంగా వైకాపా నేత జగన్ ఆశీస్సులతోనే జరిగిందని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కోను ఎదుర్కోవాలంటే వైకాపా బలం మరింత పెరగాలి. ఖైదీ సినిమా హడావుడి చూశాక, ఆ బలం చిరు రూపంలో కనిపించింది. భవిష్యత్తులో రాజ్యసభ సభ్యత్వం, కేంద్రంలో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి హామీతో చిరును ఆకర్షించే ప్రయత్నాలు వైకాపా చేస్తోందని రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి.
చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక సాక్షి మీడియా ఆయనపై ఎప్పుడూ బురదజల్లే ప్రయత్నమే చేసింది. కానీ ఖైదీ సినిమాకు మాత్రం ఉచిత ప్రమోషన్ చేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఊహించని రాజకీయ సమీకరణలు జరగొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.