మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. వార్తా ఛానళ్ళ ఇంటర్య్వూలో తను కాంగ్రెస్ లో కొనసాగుతున్నట్టు ఆయన వెల్లడించారు. తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150' సినిమా గురించి అందరూ ఏదో విధంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు. కనీసం పిసిసి నేతలు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు. తమ పార్టీ నాయకుడు చిరంజీవి ఛరిష్మా పెరిగితే అది పార్టీకి లాభమే అనే విషయం కాంగ్రెస్ నేతలు మరిచారు. అయితే కొంతకాలంగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారని, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చేస్తున్న ఉద్యమాలకు తోడ్పాటు అందించడం లేదని కాంగ్రెస్ నేతల ఆరోపణ. పార్టీ తరుపున కేంద్ర మంత్రి పదవి అనుభవించి, రాజ్యసభ సభ్యుని హోదా పొందిన చిరంజీవి వచ్చే ఎన్నికల్లో (2019) యాక్టీవ్ గా పాల్గొంటారా అనే అనుమానం పార్టీ నేతల్లో ఉంది. ఈ కారణం చేత పార్టీ కేడర్ 'ఖైదీ' సినిమా విషయంలో ఎలాంటి ఆసక్తిని ప్రదర్శించడం లేదని వారు భావిస్తున్నారు.
బాలకృష్ణ విషయానికి వస్తే 'శాతకర్ణి' సినిమాను టిడిపి వర్గాలు అడాప్ట్ చేసుకున్నాయి. ప్రమోషన్ కోసం తమకు తోచిన విధంగా తోడ్పాటు అందిస్తున్నారు. పార్టీ జండాలతో ర్యాలీలు నిర్వహించడమే కాదు, థియేటర్లను పచ్చ జంఢాలతో అలంకరిస్తున్నారు. బాలయ్య తెదేపా శాసనసభ్యుడు కావడమే కాదు, భవిష్యత్తులో పార్టీలో కీలక పాత్రధారి అవుతాడని వారు నమ్ముతున్నారు.
ఇద్దరు అగ్రహీరోలు చెరో పార్టీలో ఉన్నారు. ఒకరికి పార్టీ దూరంగా ఉంటే మరొకరికి మద్దతుగా నిలిచింది.