ప్రముఖ నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అత్యద్భుతంగా తెరకెక్కి మరికొన్ని గంటల్లోనే విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే దర్శకుడు క్రిష్‌కి మాత్రం ఈ చిత్రంపై కాస్త భయం పట్టుకున్నట్లు తెలుస్తుంది. తెలుగుజాతి చరిత్రను, ఉన్నతిని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో గొప్ప చారిత్రక దృశ్యకావ్యంగా దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుంది. అయితే గౌతమి పుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా చేసుకొని చేసిన ఈ చిత్రంపై చిత్ర యూనిట్ కు పూర్తి నమ్మకం ఉంది. కానీ ఓ టెన్షన్ మాత్రం వేధిస్తున్నట్లుగా తెలుస్తుంది. శాతకర్ణి చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి విజువల్ వండర్ అన్నట్లు ‘బాహుబలి’తో పోలుస్తూ జనాల్లో ఊహలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇదీ హిస్టారికల్ చిత్రం కావడం, ఇందులో భారీస్థాయి యుద్దాలు, ఏకంగా గంటపాటు యుద్ధ సన్నివేశాలే ఉండటంతో ప్రేక్షకులు అంతా బాహుబలిని మించిన ఫాంటసీలా ఊహాలోకంలో విహరిస్తుండటం తెలిసిందే.
అయితే తాజాగా దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... అసలు బాహుబలికి గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి పోలికే లేదని వెల్లడించాడు. క్రిష్ ఇంకా మాట్లాడుతూ... బాహుబలి ఓ ఫాంటసీతో కూడుకున్న చిత్రమని, శాతకర్ణి మాత్రం ఓ చక్రవర్తి చరిత్ర అని, రెండిటినీ ఒకేలా పోల్చడం పొరపాటని ఆయన వెల్లడించాడు. గౌతమి పుత్ర శాతకర్ణి విజువల్ ఎఫెక్ట్స్ కు చెందిన చిత్రమే కాదని, ఇది అసలు ఇటువంటి జోనర్ కు చెందిన చిత్రమే కాదని ఈ సినిమా పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా చేశామని ఆయన వెల్లడించాడు. మొత్తానికి ఈ చిత్రం ఎమోషనాలిటీపై ఆధారపడి నడిచిన సినిమాగా ఆయన ఒక స్పష్టతను ప్రక్షకులకు పంపాడు. అయితే బాహుబలి సినిమా ప్రభావం ఏమన్నా గౌతమి పుత్ర శాతకర్ణి మీద పడుతుందేమోనన్నభయంతో క్రిష్ కంగారుపడుతున్నట్లుగానే తెలుస్తుంది. చూద్దాం ప్రేక్షక దేవుల్ల ఆదరణ ఎలా ఉంటుందో.