ఇటీవల జరిగిన చిరంజీవి 'ఖైదీనెంబర్150' చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో నాగబాబు యండమూరి మరీ ముఖ్యంగా వర్మలపై చేసిన కామెంట్స్ సంచనలం సృష్టించాయి. దీనికి యండమూరి కాస్త తక్కువ స్థాయిలో స్పందించినా, వర్మ మాత్రం అంతే ఘాటుగా స్పందించిన సంగత తెలిసిందే. ఇక చిరు మీద ఉన్న అభిమానంతో ట్వీట్స్ చేయడం మానేస్తానని, కానీ నాగబాబు సై అంటూ ఆ కుటుంబానికి సంబంధించిన పలు రహస్యాలను ట్వీట్స్ చేస్తానని, ఆ రహస్యాలు ఏమిటో ఆ కుటుంబానికి మాత్రమే తెలుసునంటున్నాడు. దానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని హెచ్చరించడంతో మెగాహీరోలు ఇక దీనిపై పెద్దగా స్పందించకుండా మౌనం వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
చిరు కూడా వర్మ గురించి సాఫ్ట్‌గానే సమాధానాలు ఇస్తున్నాడు.. కానీ వర్మపై తీవ్రంగా మాత్రం స్పందించడం లేదు. ఇక నాగబాబు వల్ల మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నానంటూ మెగాభిమానులను వర్మ కోరాడు. దీనిపై ఇండస్ట్రీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కొందరు నాగబాబును తప్పుపడుతుండగా, మరొకొందరు మాత్రం నాగబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. వాస్తవానికి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం వల్ల చిరు వేడుకకి పవన్ రాకపోవడం అనే అంశం పెద్దగా చర్చకు రాలేదని, అదే నాగబాబు అలా మాట్లాడకుండా ఉండి ఉంటే మెగాహీరోల మద్య ఉన్న మనస్పర్థలు, పవన్ రాకపోవడం వంటివి హైలైట్ అయ్యేవని... ఇది ముందుగా ఓ ప్లానింగ్ ప్రకారమే జరిగిందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి మెగాఫ్యామిలీపై పవన్ అలకకు కారణాలు, అల్లు అరవింద్, బన్నీల వ్యవహారం, చిరు సుమన్ వంటి హీరోని తొక్కేసిన విషయం... చిరు తన స్నేహితులైన సుధాకర్, హరిప్రసాద్ వంటి వారికి చేసిన ద్రోహంతో పాటు ఉదయ్‌కిరణ్ అంశం, ఇక అశ్వనీదత్ నిర్మాణంలో చిరుతో వర్మ చేయాల్సిన చిత్రం ఆగిపోవడం, ప్రజారాజ్యం పార్టీలో జరిగిన పలు అవకతవకల గురించే చిరుని వర్మ బ్లాక్‌మెయిల్ చేస్తూ ట్వీట్స్ పెట్టాడని, ప్రస్తుతానికి ఫ్లాప్‌లో ఉన్నప్పటికీ వర్మకు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు, తనతో సినిమాలు చేయనని చెప్పి, మరలా ప్లాప్‌ల్లోనే ఉన్న ఆయనకు అమితాబ్ మరో అవకాశం ఇవ్వడం.. వంటి విషయాలలో వర్మ గ్రేట్ అంటున్నారు.
వర్మ మొండివాడని, యండమూరి వంటి వారు మౌనం వహించినా, వర్మలాంటి వివాదాస్పద వ్యక్తిపై కామెంట్స్ చేసి మెగాఫ్యామిలీ డిఫెన్స్‌లో పడిందని కూడా చిరు వ్యతిరేకులు అంటున్నారు. అలాగే వర్మ ఎంత ఆవేశపరుడో, పవన్ కూడా అంతే ఆవేశపరుడని, గతంలో తన అన్నని టార్గెట్ చేసిన మోహన్‌బాబుకు ఆయన నిండు సభలోనే అటాక్ ఇచ్చాడని, మరి ఇప్పుడు వర్మ కామెంట్లపై పవన్ ఇంకా స్పందించకపోవడం ఏమిటని? గతంలో ఆయన చంద్రబాబు, మోదీలకు మద్దతు పలికి, వారి సభలకు హాజరైనా కూడా తన అన్నయ్యను విమర్శిస్తే మాత్రం తాను రానని చెప్పిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.