అల్లరి నరేష్ నటించిన 'నేను' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరోయిన్ అర్చన. కాగా ఆమెకు అందం, టాలెంట్ అన్ని ఉన్నాయి. కానీ సరైన అవకాశాలు లేక కనుమరుగైపోవడం బాధాకరం. కాగా గత కొంతకాలంగా బాలీవుడ్ హీరోయిన్లు అయిన కంగనారౌనత్, రాధికాఆప్టే వంటి వారు సినిమా పరిశ్రమలో అవకాశాలు సాధించాలంటే హీరోలు, దర్శకనిర్మాతల లైంగికవేధింపులు తప్పవని, ఇవి ఓపెన్‌సీక్రెట్ అని చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్చన కూడా అదే ఆవేదనను వ్యక్తం చేసింది. నాకు 'నేను' చిత్రం తర్వాత పలు అవకాశాలు వచ్చాయి. కానీ అనుకోకుండా నేను 'నువ్వొస్తానంటే... నేనొద్దంటానా' చిత్రంలో ఓ డీగ్లామర్ పాత్రలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. కళ్లజోడు పెట్టుకునే డీగ్లామర్ పాత్రని బలవంతం మీద చేయాల్సి వచ్చింది. దాంతో నాకు వచ్చిన పలు హీరోయిన్ అవకాశాలు పోయాయి. ముఖ్యంగా ఓ టాప్ డైరెక్టర్ చిత్రంలో ఛాన్స్ మిస్ అయింది. ఒక హీరో అయితే నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. ఎంతో ఆనందం వేసింది. కానీ తొలిరోజు షూటింగ్ తర్వాత ఆ హీరో 'నేను నీకు అవకాశం ఇచ్చాను కదా..! మరి నువ్వు నాకేం ఇస్తావు' అని వెకిలిగా అడిగాడు. దాంతో నాకు అతని ఉద్దేశ్యం అర్ధమై 'మీకు నేను ఇవ్వగలిగేంత దాన్ని కాదు....' అని వెళ్లిపోయాను. దాంతో ఆ చిత్రంలోని నా సీన్స్ అన్ని డిలేట్ చేశారు. 'నువ్వొస్తానంటే... నేనొద్దంటానా'లో ఆ పాత్ర చేసి పెద్ద తప్పు చేశాను. ఇక 'కమలతో నా ప్రయాణం' చిత్రం సమయంలో ఆ సినిమాకు కాస్త ప్రొమోషన్ చేసిపెట్టమని చాలా మంది సినీ పెద్దలను అడిగాను. కానీ ఎవ్వరు నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇక రాజమౌళి గారి గురించి చెప్పాలి. ఆయన చాలా మంచి వ్యక్తి. నాకు 'మగధీర' చిత్రంలో సలోని పాత్రను చేయమని ఆఫర్ ఇచ్చారు. కానీ నేను ఆ పాత్రను చేయకుండా తప్పు చేశాను. అలా నా కెరీర్ నాశనమైపోయింది.. అని ఆవేదన వ్యక్తం చేసింది.