కమల్‌హాసన్ తర్వాత విలక్షణ నటునిగా విక్రమ్‌కు అంత మంచి పేరుంది. పాత్రకు న్యాయం చేయడం కోసం ఆయన ఎంతటి త్యాగానికైనా రెడీ అవుతాడు. ఆయనకంటూ మంచి క్రేజ్, ఇమేజ్ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు ఆ ఛట్రంలో ఇరుక్కోలేదు. తనకొచ్చిన విభిన్న పాత్రలను చేస్తూ, జయాపజయాలకు అతీతంగా సాగుతూనే ఉన్నాడు. ఆయన పాత్రకు ఎంతలా ప్రాణం పోస్తారన్నది ఆయన నటించిన 'శివపుత్రుడు, అపరిచితుడు, ఐ' వంటి చిత్రాలను చూస్తే అర్ధమవుతుంది. సాధారణంగా ఒక ఇమేజ్ అంటూ వచ్చిన తర్వాత స్టార్స్ విభిన్నచిత్రాలను, విభిన్నపాత్రలను చేయడానికి వెనుకాడుతారు. ముఖ్యంగా విలన్ పాత్రలను, నెగటివ్ టచ్ ఉన్న పాత్రలను చేయడానికి సాహసించరు. కొందరు మాత్రం వీటికి అతీతంగా ఉంటారు. మంచిపాత్రలు వస్తే విలన్ పాత్రకు కూడా సై అంటారు. కానీ అందులో హీరో, విలన్ పాత్రలను రెండింటిని తామే చేయడానికైతే ముందుకు వస్తారు. ఇక ఓ మంచి పేరు వచ్చిన తర్వాత కమల్ కూడా 'భారతీయుడు, దశావతారం' వంటి చిత్రాలలో తానే హీరోగా, విలన్‌గా ఇలా విభిన్నపాత్రలను చేశాడు. తాజాగా సూర్య కూడా '24' చిత్రంలో హీరో, విలన్‌గా రెండు పాత్రలను తానే పోచించాడు. ఇక కాస్త నెగటివ్ టచ్ ఉన్న 'టెంపర్, 'బిజినెస్‌మేన్' వంటి చిత్రాలు తెలుగులో వచ్చాయి. కానీ పక్క హీరో చిత్రంలో అందునా తన కంటే ఇమేజ్‌లో ఎంతో తక్కువస్థాయిలో ఉన్న హీరో చిత్రంలో విలన్ పాత్రను చేయడానికి మాత్రం సౌత్‌ఇండియన్ స్టార్స్ ఒప్పుకోరు. ఒకప్పుడు హాలీవుడ్ హీరోలు, తాజాగా బాలీవుడ్ స్టార్స్ మాత్రం అలాంటి పాత్రలను చేయడానికి ఇగో లేకుండా ఒప్పుకుంటున్నారు. కాగా గతంలో మణిరత్నం తీసిన 'విలన్' బాలీవుడ్ మూవీలో చియాన్ విక్రమ్ విలన్‌గా నటించాడు. మరోసారి ఆయన ఏకంగా తమిళం, మలయాళం, తెలుగుభాషల్లో విడుదల చేయాలని భావిస్తున్న ఓ చిత్రంలో ఓ యంగ్‌హీరోకు ప్రతినాయకుడిగా నటించనున్నాడు. త్వరలో క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్‌మీనన్ తమిళంలో మలయాళ యంగ్ హీరో, 'ప్రేమమ్' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నవీన్‌పౌల్‌తో ఓచిత్రం చేయనున్నాడు. ఇందులో విలన్‌గా నటించడానికి విక్రమ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. తమిళంతో పాటు మలయాళం, తెలుగు భాషల్లో కూడా ఈ చిత్రం డబ్బింగ్ రూపంలో విడుదలకానుంది. ఇందులో విక్రమ్ పూర్తిస్థాయి విలన్‌గా దర్శనమిస్తున్నాడు. కాగా ఇటీవలి కాలంలో సీనియర్ హీరోలు తమ హీరో కెరీర్ ముగుస్తున్న తరుణంలో విలన్లుగా మెప్పిస్తున్నారు. ఇందుకు జగపతిబాబు, అరవింద్‌స్వామిలను ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ విక్రమ్ మాత్రం హీరోగా మంచి పేరున్నప్పుడే విలన్ పాత్రను చేయనుండటం హాట్‌టాపిక్‌గా మారింది.