'శ్రీమంతుడు' చిత్రం సమయంలో గ్రామాలను దత్తత తీసుకోవడం బాగా జోరందుకుంది. కానీ దెయ్యాలను దత్తత తీసుకునే వారు కూడా మనకు కనిపిస్తున్నారు. అతనెవరో కాదు.. స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉండి తర్వాత నటునిగా, దర్శకునిగా మారి హీరో స్థాయికి ఎదిగిన రాఘవలారెన్స్. ఆయన హర్రర్ కామెడీ చిత్రాల ట్రెండ్‌కు 'ముని' చిత్రంలో నాంది పలికాడు. ఆ తర్వాత కూడా 'ముని'కి సీక్వెల్స్‌గా తీసిన 'కాంచన, గంగ' వంటి చిత్రాలు తమిళంలోనే కాదు..తెలుగులోనూ ఘనవిజయం సాధించి, ఆయనకు దర్శకునిగా, హీరోగా స్టార్ స్టేటస్‌ను తెచ్చిపెట్టాయి. నిర్మాతలకు భారీ లాభాలను సంపాదించాయి ఆ తర్వాత ఆయన తెలుగులో ప్రభాస్‌తో 'రెబెల్' వంటి యాక్షన్ చిత్రం చేసినా అది డిజాస్టర్ అయింది.
దాంతో మరలా ఆయన దెయ్యాల బాటనే నమ్ముకుంటున్నాడు. ఇంతకాలం ఆయన కేవలం తన దర్శకత్వంలో మాత్రమే దెయ్యాల చిత్రాలు చేసి, హీరోగా నటించి పేరు సంపాదించాడు. ప్రస్తుతం ఆయన ఇతర దర్శకులతో కూడా దెయ్యాల చిత్రాలలో చేస్తున్నాడు. 'చంద్రముఖి' వంటి చిత్రాన్ని తీసిన సీనియర్ దర్శకుడు పి.వాసు ఇటీవల కన్నడలో శివరాజ్ కుమార్‌తో 'శివలింగ' అనే హర్రర్ చిత్రం తీశాడు. ఇది కన్నడంలో మంచి విజయం సాధించింది. దాంతో ప్రస్తుతం పి. వాసు ఇప్పుడు అదే చిత్రాన్ని తమిళంలో లారెన్స్ హీరోగా అదే టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం డబ్బింగ్ రూపంలో ఆదే పేరుతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోపక్క లారెన్స్ మరలా తన దర్వకత్వంలోనే 'ముని'కి సీక్వెల్‌గా నాలుగవ భాగానికి శ్రీకారం చుట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీంతో అందరూ ఆయన్ను దెయ్యాల హీరో అంటూ పిలుస్తున్నారు.