ఒకప్పుడు ప్రతి చిత్రానికి, ముఖ్యంగా స్టార్‌హీరోలకు, వారి అభిమానులకు వారధిగా ఆడియో వేడుకలు ఉండేవి. ఆడియో వేడుకలను ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేసి, అభిమానుల సమక్షంలో జరిపేవారు. ఈ వేడుకలలోనే వారు ఆ చిత్రం ఎలా వచ్చింది?తమ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించనుంది? తాము ఈ చిత్రానికి ఎంత కష్టపడ్డాం..? అనేవి చెప్పుకునేవారు. కానీ రాను రాను ఆడియో వేడుకలలో తమ అభిమానులను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో, ఇతరులను, తమ వ్యతిరేకులను అవమానించేలా మాట్లాడటం.. ఆ చిత్రంపై వస్తున్న సద్విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకుంటూ. వాటికి సున్నితంగా సమాధానాలు చెప్పడం మానివేసి, తమ చిత్రంపై వస్తున్న విమర్శలకు కారకులైన వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, మీడియను తప్పుపడుతూ, వారిని వెంట్రుక సమానంగా తీసిపారేస్తూ, అవమానించేలా, అభిమానులను రెచ్చగొట్టేలా ప్రసంగించడం రివాజుగా మారిపోయింది.
ప్రస్తుతం ఆడియో వేడుకల స్థానంలో కొత్తగా ప్రీరిలీజ్ ఫంక్షన్లు చేయడం మొదలుపెట్టారు. వేడుకల పేరు మారిందే గానీ... సినిమా వారిలో మాత్రం మార్పు రాలేదు. ఇక ఆడియో ఫంక్షన్లు చేయకుండా, డైరెక్ట్‌గా పాటలను మార్కెట్‌లోకి విడుదల చేయడం వల్ల నిర్మాతలకు అదనపు ఖర్చు మిగిలితుందని, ఇది నిర్మాతలకు ఆర్ధికంగా మేలు చేకూరుస్తుందని కొందరు ఘనత వహించిన సినీ పెద్దలు సెలవిస్తుండటం చూస్తే నవ్వురాకమానదు. ఆడియోకు ఎంత ఖర్చవుతుందో అంతకంటే పెద్ద బడ్జెట్‌లను ప్రీరిలీజ్ వేడుకలకు ఖర్చుపెడుతున్నారు. ఎవరైనా తమ చిత్రాలను విమర్శిస్తుంటే.. వారికి చేతల్లో.. తమ సినిమాలను బ్లాక్‌బస్టర్స్‌గా కసితో తీసి, వాటితోనే విమర్శలకు చెక్‌పెట్డడం మానివేసి, పిచ్చి పిచ్చి కారుకూతలతో, సభ్యసమాజం సిగ్గుపడే పదజాలం వాడుతుండటం బాధాకర పరిణామమేనని చెప్పకతప్పదు. విమర్శకులకు సరైన సమాధానం చెప్పాల్సివస్తే.. సెటైరిక్‌గా, హుందాగా జవాబు చెప్పాలే గానీ, ఇలా నోటికి వచ్చినట్లు ప్రసంగాలు చేయడం మానుకుంటే మేలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.