పవన్‌కళ్యాణ్, రేణుదేశాయ్‌లు విడిపోయినా కూడా ఇద్దరు ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఆలోచనా విధానం, సామాజికస్పృహలో మాత్రం ఇద్దరి ఆలోచనలకు చాలా సారూప్యత కనిపిస్తోంది. ఈ విషయం గతంలో కూడా ఎన్నోసార్లు నిరూపితమైంది. కాగా రాజకీయాలలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారికత, పురుషులతో సమానంగా స్త్రీ స్వేచ్ఛ వంటి విషయాలలో తన మనోభావాలను పవన్ తెలుపుతూనే ఉన్నాడు. ఇటీవల అమీర్ నటించిన 'దంగల్' మూవీ చూసిన తర్వాత కూడా ఆ చిత్రంలో ఆడపిల్లల గురించి, వారి సాధికారత, వారిలోని అంతర్గత శక్తులు, వారికి సమాజం ఇవ్వాల్సిన గౌరవం వంటి విషయాలను ప్రస్తావిస్తూ, తన సందేశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ కూడా మహిళలపై జరుగుతున్న వేధింపులు, హింస, లైంగిక దాడుల విషయంలో ఘాటుగా స్పందించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగుళూరులో జరిగిన ఘటనపై ఆమె సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బెంగుళూరులో మహిళలపై జరిగిన అరాచకం గురించి ఆమె కొందరు అడిగిన ప్రశ్నలకు ఆలోచనాత్మక సమాధానాలను ఇచ్చారు. ఓ అభిమాని మాట్లాడుతూ, ముందుగా సినిమాలలో మహిళలపై చూపిస్తున్న అకృత్యాలు, వేధింపులు, హింసాత్మక సన్నివేశాలను తప్పుపట్టగా, ఆమె ఆ అభిమాని అభిప్రాయంతో ఏకీభవించింది.
నిజమే.. ముందుగా ఇలాంటి సన్నివేశాలను సినిమాలలో చూపించకుండా ఉండేలా చూడాలి. వీటిని చూసి పలువురు ప్రేరణ పొందుతున్నారని చెప్పింది. ఇక ఇలాంటి ట్వీట్స్ వల్ల మగాళ్ల మైండ్‌సెట్ ఏమైనా మారుతుందా? అనే ప్రశ్నకు సమాధానంగా మారకపోవచ్చు. కానీ ఇలాంటి చర్చల వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు తప్పకుండా జరుగుతుందన్నారు. ఓ అభిమాని ముందుగా అమ్మాయి మైండ్‌సెట్ మారాలి. వారు పొట్టిబట్టలు వేసుకోవడం, ఇలా విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం మానాలి... అన్న దానికి ఘాటుగా సమాధానం ఇచ్చింది.
మహిళలపై అత్యాచారాలు, వేధింపులు ఎక్కువగా గ్రామాలలో, చిన్న చిన్న పట్టణాలలోనే జరుగుతున్నాయని, అక్కడ మహిళలు సాంప్రదాయబద్దంగా చీరలు, లంగా, ఓణీలలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తారని విశ్లేషించింది. ఇంకా ఆ ప్రశ్నను అడిగిన వ్యక్తిపై మండిపడుతూ, ఎంజాయ్ కేవలం మగాళ్లే చేయాలి.. ఆడవారు చేయకూడదని ఎక్కడైనా రాసిపెట్టి వుందా? మరి మీరు సంప్రదాయ దుస్తులైన ధోతీ, లుంగీ, పంచె వంటివి కడుతున్నావా? అని ఘాటుగా స్పందించింది. మొత్తానికి పవన్, రేణుదేశాయ్‌లు ఇద్దరు మంచి ఫెమినిస్ట్‌లే అని ఒప్పుకోవాల్సిందే.