మెగా స్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తీసుకుని టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులని అలరించడానికి తొందర్లోనే ప్రేక్షకులముందుకు వచ్చేస్తున్నాడు చిరు. 'ఖైదీ... ' సంబందించిన ఒక్క పబ్లిక్ ఈవెంట్ కూడా ఇంతవరకు జరగలేదు. ఆడియో వేడుకని భారీగా జరిపిద్దామనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది క్యాన్సిల్ అయ్యింది. ఇక 'సరైనోడు, ధృవ' చిత్రాల మాదిరిగా 'ఖైదీ నెంబర్ 150' కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని భారీ లెవల్లో చెయ్యడానికి నిర్మాత రామ్ చరణ్ అదిరిపోయేలా ప్లాన్ చేసాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఏపీ లోని విజయవాడ నగరంలో చేద్దామనుకుంటే దానికి గవర్నమెంట్ పర్మిషన్ దొరక్క విజయవాడకు సమీపంలోని హయ్ ల్యాండ్ లో ఈ రోజు సాయంత్రం జరిపించడానికి కనీ విని ఎరుగని ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ ఈవెంట్ కి మెగా హీరోలందరూ.... టాలీవుడ్ లోని అతిరథమహారధులు హాజరుకానున్నారు. ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీతో కలిసి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడ మీదుగా హాయ్ ల్యాండ్ కి బయలు దేరాడు. చిరంజీవికి అభిమానులు సాదర స్వాగత పలికారు. ఇక చిరు కూడా కార్ డోర్ పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక విజయవాడ చుట్టుపక్కల అంతా 'ఖైదీ...' ఫీవర్ చుట్టుముట్టేసింది. ఎవరు చూసినా అందరూ 'ఖైదీ నెంబర్ 150' గురించే మాట్లాడుకుంటున్నారు.
మెగాభిమానులతో హయ్ ల్యాండ్ ప్రాంతమంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అరుపులు కేకలతో మార్మోగిపోతోంది. మెగా స్టార్ చిరూ అంటూ నినాదాలతో హోరెత్తించేస్తున్నారు. ఇక 'ఖైదీ నెంబర్ 150' చిత్రం జనవరి 11 న సంక్రాతి కానుకగా విడుదలవుతుంది.