30ఏళ్ల కిందట చిన్న చిన్న పాత్రలతో తన సినీ ప్రస్దానాన్ని ప్రారంభించాడు ఆర్.నారాయణమూర్తి. ఈయన ఓ వ్యక్తి కాదు.. శక్తి.. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో ఎంతో రిస్క్ చేసి తానే ప్రధానపాత్రలను పోషిస్తూ, తానే దర్శకనిర్మాతగా మారాడు. అలా ఆయన చేసిన మొదటి చిత్రం 'అర్ధరాత్రి స్వాతంత్య్రం', ఇక ఆపై జయాపజయాలకు అతీతంగా సినిమాలు నిర్మిస్తూనే ఉండటం చిన్నవిషయమేమీ కాదు. ఆయన 'చీమలదండు, ఎర్రసైన్యం' వంటి చిత్రాలతో సంచలనం సృష్టించారు. ఇక దాసరి దర్శకత్వంలో ఆయన నటించిన 'ఒరేయ్...రిక్షా' కూడా బాగా ఆడి ఆయనకు పీపుల్స్‌స్టార్ అనే బిరుదును తెచ్చిపెట్టింది.
ముఖ్యంగా ఎర్ర చిత్రాలను అభిమానించే ప్రేక్షకులు ఆయన చిత్రాలు ఎప్పుడు వస్తాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఒకప్పుడు ఇలాంటి విప్లవాత్మక చిత్రాల హీరోగా పేరుగడించిన రెడ్‌స్టార్ మాదాల రంగారావు స్థానాన్ని ఈయన విజయవంతంగా భర్తీ చేశాడని చెప్పవచ్చు. ఆయన ఎప్పుడో గానీ బయటి చిత్రాలలో నటించరు. ప్రస్తుతం ఆయన 'బిచ్చగాడు' నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో జయసుధతో కలిసి 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' అనే చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలకు సిద్దమవుతోంది.
కాగా ఇదే పండగకి స్టార్స్ అయిన చిరు, బాలయ్యల చిత్రాలతో పాటు దిల్‌రాజు నిర్మిస్తున్న 'శతమానం భవతి' కూడా విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అదే పోరులో తాను కూడా నిలిచి నారాయణమూర్తి సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. కాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇద్దరుస్టార్స్ చిత్రాల మధ్యలో పీపుల్స్ స్టార్ అంటున్నారని, కానీ తన సినిమా ఎవ్వరికీ పోటీ కాదన్నాడు. ఆయన తన చిత్రానికి సింగిల్ థియేటర్లు దొరక్కపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్ద చిత్రాలు వచ్చినప్పుడు, పండగలకు స్టార్స్ చిత్రాలు వస్తాయి.. కాబట్టి చిన్న సినిమాలను ఆ సమయంలో కాకుండా విడుదల చేసుకోవాలని కొందరు సూచించడం పట్ల మండిపడ్డారు.
సినిమా చిన్నదైనా, పెద్దదైనా, ప్రేక్షకులకు నచ్చి ఆదరిస్తేనే అది పెద్ద చిత్రం అవుతుంది. దాన్ని నిర్ణయించాల్సింది ప్రేక్షకులే. పెద్ద హీరోల చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని ఒకే సినిమాను అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారని, ఇండస్ట్రీ ఏ ఒక్కరిదో కాదని, అందరిది అన్నాడు. ఇక థియేటర్లన్నీ కొందరి చేతుల్లోనే ఉండటంతో ఈ సమస్య తలెత్తుతోందని ఆవేదనగా చెప్పుకొచ్చారు. చిన్న చిత్రాలకు థియేటర్లు లభించేలా చూడాల్సిన బాధ్యత ఫిల్మ్‌ఛాంబర్‌పై, నిర్మాత మండలిలపైనే కాకుండా ప్రభుత్వాలపై కూడా ఉందని స్సష్టం చేశాడు.
ఇక 'టెంపర్' చిత్రంలోని పోసాని పోషించిన హెడ్ కానిస్టేబుల్ పాత్ర చేయడానికి తాను నిరాకరించడానికి కారణం చెబుతూ, చిన్న చిన్నవేషాలు వేసుకునే నేను నేడు లీడ్‌రోల్స్ పోషించే స్థాయికి చేరానని, మరలా వెనక్కు వెళ్లి సపోర్టింగ్ రోల్స్ చేయాలని తాను భావించడం లేదని, ఎంత పెద్ద సంస్థ అడిగినా, నా నిర్ణయంలో మార్పు ఉండదని తేల్చిచెప్పారు. కాగా తనను చాలా మంది పోలీస్‌లు తమపై చిత్రాలు తీయాలని కోరుతూ వస్తున్నారని, తాను పోలీస్‌లకు వ్యతిరేకంగా కాదని, కేవలం ఈ వ్యవస్థకే వ్యతిరేకినని స్పష్టం చేశాడు. ప్రస్తుతం పీపుల్స్‌స్టార్ వ్యాఖ్యలు ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.